నల్లగొండ జిల్లా:యాసంగిలో పండిన ప్రతి గింజను కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని,యాసంగీ సీజన్ లో పండిన వరి ధాన్యం కొనుగోలుకు జిల్లా కలెక్టర్లు, అధికారులు యుద్ద ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని, కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు.
బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్ లో యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై ఉమ్మడి నల్గొండ జిల్లా శాసనసభ్యులు, జడ్.పి.చైర్మన్లు,జిల్లా కలెక్టర్లు,అదనపు కలెక్టర్లు, ధాన్యం సేకరణ అధికారులు,మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా వ్యవసాయం రంగం అభివృద్ధి చెంది, రైతాంగం ఊరట పొందుతున్న పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం నిర్వర్తించవలసిన బాధ్యతల నుండి తప్పించుకుంటోందని ఆరోపించారు.
రైతు నష్టపోకుండా రైతాంతాంగాన్ని కాపాడుకోవాలని శాసనసభ్యులు, రైతాంగం విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం మంత్రి మండలి సమావేశం నిర్వహించి మంత్రులు,అధికారులతో చర్చించి,మానవతా దక్పథంతో ఆలోచించి,రైతు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారని అన్నారు.కొంతమంది నాయకులు మేం కొంటామని రైతాంగాన్ని తప్పుదోవ పట్టించి మోసం చేశారన్నారు.అనుకోకుండా ఎదురైన ఈ సవాల్ ను స్వీకరించి రైతాంగాన్ని కాపాడవలసిన బాధ్యత అందరిపై వుందన్నారు.
ఆహార భద్రత చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రతి గింజ కొనాలని,కొన్న ఆహార ధాన్యం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దేశం అంతటికీ సరఫరా చేయాలని,ఈ బాధ్యతను నిర్వర్తిస్తూ రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త వంగడాలు,నూతన టెక్నాలజీ వలన ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని అన్నారు.
ఆహార సంక్షోభం వున్నప్పుడు,నిల్వలు అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని,ఆహార భద్రత చట్టం ప్రకారం ధాన్యం సేకరణకు ఎఫ్.సి.ఐ.గోదాములు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.పంజాబ్ మాత్రం కేంద్ర ప్రభుత్వ సేకరణ విధానానికి ఒప్పుకోలేదని,అన్ని రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎఫ్.సి.ఐ ద్వారా ధాన్య సేకరణ గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోందని,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ఇదే పద్దతి కొనసాగుతుందని అన్నారు.రాష్ట్రం ఏర్పాటు ముందు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం,ఆర్థిక పరిస్థితి దెబ్బతిని రైతాంగం పక్క రాష్ట్రాలకు,దుబాయ్ కి వలసలు పోయేవారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా 22 లక్షలు బోరు బావులు ఉన్నాయని తెలిపారు.రాష్ట్ర ఏర్పాటు తర్వాత సహజ వనరుల వినియోగం,ప్రాజెక్టులు నిర్మాణం, రాష్ట్రం ఏర్పాటు తర్వాత 3 సం.లలోనే 24 గంటల ఉచిత విద్యుత్ తో తెలంగాణ రాష్ట్రం గత రెండు సం.లుగా 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి,దేశానికి అన్నపూర్ణగా ఉన్న పంజాబ్ రాష్ట్రంను అధిగమించి మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు.వానాకాలం పంటను కేంద్రం తీసుకోవడానికి కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోంది,రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన మంత్రిని కలిసి విన్నపం చేసినా కేంద్రం స్పందించ లేదని,బాయిల్డ్ రైస్,దొడ్డు బియ్యం యాసంగిలో తీసుకోమని ముందే చెప్పి సి.ఎస్.రాష్ట్ర పౌర సరఫరాల అధికారులతో ఒప్పందం చేసుకుని వానా కాలం పంట తీసుకుందని అన్నారు.రైతులను దొడ్డు రకం పండించ వద్దని,బాయిల్డ్ రకం పెట్టవద్దని విస్తృత ప్రచారం చేసినట్లు,కొంత మంది బాధ్యత లేని నాయకులు మేమే కొంటామని రైతులను తప్పుదోవ పట్టించి మోసం చేశారని అన్నారు.20 లక్షల ఎకరాలు బాయిల్డ్ రైస్ ఈ యాసంగిలో పండించటానికి కారణం అయ్యారని అన్నారు.దేశ చరిత్రలో మొదటి సారిగా మంత్రులు,ఎంపిలు, ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లి సిఎం బాధ్యతగా వరి కొనుగోలు చేయాలని డిమాండ్ చేసినా కేంద్రం స్పందించలేదని అన్నారు.
మంగళవారం క్యాబినెట్ లో చర్చించి సలహాలు తీసుకుని మన రైతాంగాన్ని మనమే ఆదుకోవాలని,వెంటనే అన్ని జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినందువలన ఈ రోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు.ఈ యాసంగిలో దాదాపు 14 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందని, ఇందుకుగాను ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతంలో వినియోగించిన 934 కేంద్రాలను ఈసారి కూడా తగ్గించకుండా 934 కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు,మిల్లర్లు సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ పూర్తిచేయాలని తెలిపారు.రైస్ మిల్లర్లు పూర్తిగా సహకారం అందించాలని,ఎలాంటి పొరపాట్లు ఉండరాదని, అలసత్వం వహిస్తే చర్యలు ఉంటాయని తెలిపారు.
రైతుల బాగు కోసం ప్రభుత్వం చేసే ధాన్యం కొనుగోలులో మిల్లర్లు తమ వంతు సహకారం అందించాలని తెలిపారు.ఇతర రాష్ట్రాల నుంచి ఒక్క గింజ కూడా మన రాష్ట్రంలోకి రాకుండా జిల్లా సరిహద్దులలో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు, ప్రభుత్వ లక్ష్యాలను నిర్వీర్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.
కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న ప్రక్రియను ఏ రోజుకు ఆ రోజు ఆన్లైన్ డేటా ఎంట్రీ పూర్తి చేయాలని,అవసరమైతే అదనంగా సిబ్బందిని నియమించుకోవాలని,వివిధ శాఖల ఉద్యోగులను భాగస్వామ్యం చేయాలని,కీ పాయింట్ల వద్ద ప్రభుత్వ ఉద్యోగిని నియమించాలని,రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.శాసనసభ్యులు సేకరణ కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తారని,ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తారని తెలిపారు.
నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ రెండు రోజుల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని, గత యాసంగి లో 374 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని,ఈ యాసంగిలో కూడా 374 కేంద్రాలు కొనసాగిస్తూ డిమాండ్ కనుగుణంగా ఏర్పాటు చేస్తామని అన్నారు.జిల్లాలో 4 లక్షల 40 వేల 373 ఎకరాలలో వరి సాగు జరిగినట్లు,11 లక్షల 36 వేల 892 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసినట్లు,5,33,001 మెట్రిక్ టన్నులు సన్నరకం,6,03,891 మెట్రిక్ టన్నులు దొడ్డురకంగా వ్యవసాయ శాఖ అంచనా వేసినట్లు తెలిపారు.గత యాసంగిలో 7.8 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ చేయగా,ఈ యాసంగిలో 6లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ చేయనున్నట్లు తెలిపారు.గన్ని సంచులు 1.5 కోట్ల అవసరం వుందని తెలిపారు.టార్పాలిన్ లు,తేమ యంత్రాలు,తూకం యంత్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుని కొనుగోలు చేసిన ధాన్యం ఏ రోజు కా రోజూ ఓ.పి.ఎం.ఎస్.లో డేటా ఎంట్రీ పూర్తి చేసి అధికారుల ద్వారా పర్యవేక్షిస్తామని అన్నారు.సూర్యాపేట జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 327 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని,అలాగే అన్ని కేంద్రాలలో మౌళిక వసతులు కల్పించడం జరుగుతుందని అన్నారు.ఈ యాసంగి పంట మొత్తం 4,61,532 హెక్టార్లలో వరి సాగు చేయగా, 11,54,254 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని తెలుపుతూ సీడ్స్,సన్నధాన్యం రైతుల వ్యక్తిగత అవసరాలకు పోను అందులో 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.
అలాగే ట్యాబ్ ఎంట్రీ చేయుటకు ప్రభుత్వ సిబ్బందిని నియమించడం జరుగుతుందని చెప్పారు.ఈ సమావేశంలో పాల్గొన్న నల్గొండ,యాదాద్రి భువనగిరి,సూర్యాపేట జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి,శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు,రవీంద్ర కుమార్,కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య,బొల్లం మల్లయ్య యాదవ్,గాదరి కిషోర్,నోముల భగత్,జిల్లా పరిషత్ చైర్మన్లు బండ నరేందర్ రెడ్డి,ఎలిమినేటి సందీప్ రెడ్డి,గుజ్జ దీపిక, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ప్రశాంత్ జీవన్ పాటిల్, పమేలా సత్పతి,వినయ్ కృష్ణారెడ్డి,నల్గొండ ఎస్పి రెమా రాజేశ్వరి,ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి,అదనపు కలెక్టర్లు,సివిల్ సప్లై, వ్యవసాయ,గ్రామీనాభివృద్ది,మార్కెటింగ్,రవాణాశాఖల అధికారులు,రైస్ ప్రతినిధులతో మంత్రి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై సమీక్షించారు.