నల్లగొండ జిల్లా: వేములపల్లి మండల( Vemulapalle ) పరిధిలోని పలు గ్రామాల్లో సామాన్యులే టార్గెట్ గా రోజువారీ,వారం చిట్టీలతో ఫైనాన్స్ వడ్డీ మాఫియా చెలరేగిపోతుంది.ఇంతకు ముందు పట్టణాలకే పరిమితమైన గిరిగిరి దందా ఇప్పుడు పల్లెలకు కూడా పాకింది.
పల్లెల్లో చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలే టార్గెట్ గా,పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని, ఎలాంటి అనుమతులు లేకుండా అధిక వడ్డీలతో ప్రజల నడ్డి విరుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.పల్లెల్లో రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు ఈ మాఫియా చేతిలో చిక్కుకొని బయటపడలేక విలవిల్లాడుతున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నలగొండ,సూర్యాపేట, కోదాడ,హుజూర్ నగర్, మిర్యాలగూడ,భువనగిరి,ఆలేరు,నకిరేకల్ పట్టణాల నుండి వడ్డీ వ్యాపారులు మండలానికి వచ్చి పల్లెల్లో బడుగు బలహీన వర్గాల బలహీనతలు ఆసరా చేసుకుని అప్పులు ఇస్తూ అధికవడ్డీలు( High interest rates ) గుంజుతున్నరు.ఈ గిరిగిరి వ్యాపారంలో రోజువారీ, వారంవారీ వాయిదాలు చెల్లించకపోతే వారు పెట్టే వేధింపులతో ఎవరికీ చెప్పుకోలేక అల్లాడిపోతున్నారు.
ఇంత కీవీరికి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా అనేది పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
సామాన్యుల అవసరాన్ని బట్టి రూ.20 వేలు తీసుకుంటే ముందుగా రూ.2 వేలు కట్ చేసి రూ.18వేలు ఇస్తారు.వారానికి రూ.2 వేల చొప్పున 12 వారాలు చెల్లించాలి.తీసుకున్నది రూ.18 వేల అదనం మూడు నెలలకు రూ.6 వేలు చెల్లించాల్సి వస్తుంది.రూ.18 వేలకు నెలకు రూ.2 వడ్డీ వేసుకున్నా 12 వారాలకు రూ.1100 మాత్రమే వడ్డీ అవుతుంది.అంతేకాకుండా 10 మంది చెల్లించే రూ.20 వేలను ఇంకొకరికి ఇస్తూ రూ.8 నుంచి రూ.10 వరకు అధిక వడ్డీలను లాగుతున్నారు.ఇక రోజువారీ దందా అయితే వెయ్యి రూపాయలు తీసుకుంటే రూ.100 ముందే కట్ చేసుకోని రూ.900 ఇస్తారు.సాయంత్రం తిరిగి రూ.1000 చెల్లించాలి.దీనికి రూ.10 వరకు వడ్డీ పడుతుంది.పచ్చని పల్లెల్లో స్వేచ్చగా దోపిడి చేస్తుంటే వీరిపై నిఘా లేకపోవడంఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఇప్పటికైనా జిల్లా పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి ఈ అక్రమ వడ్డీ వ్యాపారుల దందాపై నిఘా ఏర్పాటు చేసి అరికట్టాలని పలువురు కోరుతున్నారు.