నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణంలోని కృష్ణమానస కాలనీలో మురికి నీరు నిత్యం రోడ్డు మీద ప్రవహిస్తూ చెరువులను తలపిస్తున్నది.మురికి నీరుకు తోడు పారిశుద్ధ్యం కూడా లోపించడంతో వీధుల్లో దుర్గంధం వెదజల్లుతుంది.
దీనితో పట్టణంలో పలువురు అనారోగ్యం పాలవుతూ ఇబ్బందులు పడుతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి.ఆ దారిన వెళ్లాలంటే నరకంగా వుందని,డ్రైనేజి వ్యవస్థ సరిగా లేకపోవడంతో సీజన్‌తో సంబంధం లేకుండా మురికినీరు రోడ్డుపై నిత్యం ప్రవహిస్తూ ఉండడంతో పందుల స్వైర విహారం చేస్తున్నాయి.
నల్గొండ-గుంటూరు నుంచి మిర్యాలగూడ పట్టణంలోకి రావడానికి,గవర్నమెంట్ హాస్పిటల్ వద్దకు వెళ్ళడానికి,రైల్వేస్టేషన్ నుంచి పట్టణంలోకి రావడానికి ఇదే రహదారి కావడంతో ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.మిర్యాలగూడ మునిసిపాలిటీ పరిధిలోని శాంతినగర్,హనుమాన్ పేట,ఈదులగూడెం, బంగారుగడ్డ,రైల్వేస్టేషన్, ఎఫ్ సి ఐ తదితర ప్రాంతాలలో మురుగు నీరు,చెత్త ఎక్కడికక్కడ రోడ్ల వెంబడి పేరుకుపోయి ఉన్నా మున్సిపల్ అధికారులు చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇప్పటికైనా అధికార యంత్రాంగం మేల్కొని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.