నల్లగొండ జిల్లా:విధి ఆడిన వింత నాటకంలో ఓ నిరుపేద కుటుంబం వీధిన పడింది.రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబ పెద్దను పక్షవాతం అనే జబ్బు కబళించి మంచానికి పరిమితం కావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డామని ఇంటి ఇల్లాలు కన్నీటి పర్యంతం అవుతున్న సంఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం కేంద్రంలో పలువురు కంట తడి పెట్టిస్తుంది.
వివరాల్లోకి వెళితే… పెద్దవూర గ్రామానికి చెందిన కిలారి చెన్నకేశవులు రెక్కల మీద జీవనం సాగిస్తున్నాడు.అతనికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కష్టం చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్న చెన్నకేశవులుకు రెండు సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చి మంచంలో పడ్డాడు.భార్య అతని చికిత్స కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసి అప్పుల పాలైంది.అయినా అతని పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఒంటి చేత్తో భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటూ,పిల్లలను చదివిస్తూ,కుటుంబాన్ని నడిపిస్తూ రెక్కలు ముక్కలు చేసుకుంటుంది.
భర్త జబ్బు నయం కాక,కుటుంబాన్ని ఈదలేక ఆ ఇల్లాలు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు.అసలే ఆర్ధిక ఇబ్బందులతో, అప్పుల బాధతో సతమతమవుతున్న ఆ కుటుంబానికి ఇప్పుడు మరో కష్టం వచ్చి పడింది.
పక్షవాతంతో జీవశ్చవంలా మారిన భర్తకు రెండోసారి బ్రెయిన్ లో వాటర్ వచ్చింది.అది తొలగించాలంటే దాదాపు రూ.10 లక్షల ఖర్చు అవుతుందని డాక్టర్లు చెబుతున్నారని భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది.ప్రస్తుతం తమ ఆర్ధిక పరిస్థితి ఘోరంగా ఉందని,రూ.10 లక్షలు పెట్టి బాగు చేయించుకునే స్థితిలో లేమని,ఎవరైనా మనసున్న మారాజులు సాయం చేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని దాతలను వేడుకుంటుంది.దయచేసి ఎవరైనా దాతలు ఉంటే తమకు తోచిన సహాయాన్ని అందించి ఒక ప్రాణాన్ని,ఓ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని, సాయం చేసే మనసున్న దాతలు నేరుగా కానీ, 8008034277 గూగుల్/ఫోన్ పే నంబర్ కు తోచిన సహాయం అందించాలని స్థానికులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.