నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షులు,రెండు దశాబ్దాలు ఎమ్మార్పీఎస్ ఉద్యమం( MMRPS movement )లో కీలక పాత్ర పోషించిన నేత కందికంటి అంజన్న మాదిగ సోమవారం అనారోగ్యంతో మృతి చెందగా మంగళవారం నిర్వహించిన అంత్యక్రియల్లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ( Manda Krishna Madiga )పాల్గొని పాడె మోసి ఉద్యమ రుణం తీర్చుకున్నారు.ముందుగా అంజన్న మాదిగ నివాసానికి చేరుకున్న ఆయన అంజన్న మాదిగ భౌతికదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి,కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ నకిరేకల్ కేంద్రంగా ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో సుదీర్ఘ కాలం పని చేసిన నాయకుడని,ఆయన మృతి ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు.అంజన్న మాదిగ భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన చూపిన పోరాట స్ఫూర్తి మనకు దారి చూపుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోడ సునీల్ మాదిగ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాచుపల్లి గంగాధర్,మాచర్ల సైదులు మాదిగ,ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు చెరుకు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు







