నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని అనుముల మండలం శ్రీనాధపురం గ్రామ రైతులు ధాన్యం కొనుగోళ్ల విషయంలో జరుగుతున్న అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పురుగు మందు డబ్బాలు చేత పట్టుకొని రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.వందలాది మంది అన్నదాతలు ఒక్కసారిగా ఆందోళనకు దిగడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
అయినా సంబంధిత అధికారులు వచ్చి కొనుగోళ్ళ ప్రక్రియ వేగవంతం చేసే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.రైతుకు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అధికారులు తక్షణమే రావాలంటూ నినదించారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లడుతూ సీజన్ ప్రారంభమై నెల రోజుల అవుతున్నా ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు.అది చాలదన్నట్లుగా ప్రకృతి ప్రకోపానికి అకాల వర్షాలు కురిసి ఐకెపి కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయని అవేదన వ్యక్తం చేశారు.
ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పెడ చెవిన పెట్టి అన్నదాతల అగచాట్లను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేలుకొని ఐకెపి కేంద్రాల్లో ఉన్న వడ్లను,మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధరతో త్వరగా కొనుగోళ్లు పూర్తి చేసి ఆరుగాలం శ్రమించే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.