నల్లగొండ జిల్లా: నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీలో వీధి కుక్కలు గుంపులుగా రెచ్చిపోతున్నాయి.కుక్కకాటు బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది.
ఇటీవల కాలంలో శునకాల దాడులు ఎక్కువై ఏదో ఒక చోట రోజూ ఎవరో ఒకరు కుక్కకాటుకు గురవుతూ బయటకు రావాలంటేనే జంకుతున్నారు.బయటకు వెళ్లిన వ్యక్తులు తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చే వరకు ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని ఏ వైపుగా ఏ కుక్క దాడి చేస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు.
ముఖ్యంగా చిన్న పిల్లలను వృద్ధులను ఇంటి నుంచి బయటకు పంపాలంటేనే భయపడుతున్నారు.
నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ,ఒకటవ వార్డుకు చెందిన కొమ్ము రాందాస్ మనవరాలు చిన్నారి హారికను ఆగస్టు 16వ తారీకున పిచ్చికుక్క తీవ్రంగా గాయపరచింది.
కమలానెహ్రు ఏరియా హాస్పిటల్ కి తీసుకెళ్లగా సరైన సమయంలో చికిత్స అందించక డాక్టర్ల నిర్లక్ష్యం వలన రేబిస్ వ్యాధి సోకి ప్రాణాపాయ స్థితికి చేరింది.చిన్నారి హారిక బ్రతకటం కష్టమని,ఈ వ్యాధి సోకిన వారు లక్షలో ఒక్కరు బ్రతికే ఛానే ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు.
దీనితో హారిక కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.
కుక్కల బెడదను నివారించేందుకు అధికార యంత్రాంగం నిర్మాణాత్మక చర్యలు చేపట్టకపోవడం ప్రజలకు ప్రాణసంకటంగా మారింది.
వీధికుక్కల నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సాగర్ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వీధుల్లో అడుగు పెట్టాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోందని మహిళలు ఆందోళన చెందుతున్నారు.
బడికి వెళ్ళేటప్పుడు తిరిగి ఇంటికి చేరే వరకు తల్లిదండ్రులను భయం వెంటాడుతూనే ఉంది.దీనితో తల్లిదండ్రులే స్వయంగా పాఠశాలలో దించి వస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడద లేకుండా చూడాలని కోరుతున్నారు.