నల్లగొండ జిల్లా:వేసవి కాలం వస్తే చాలు నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని త్రిపురారం, అనుముల,నిడమానూరు, పెద్దవూర మండలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మొరం మట్టి అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతుంది.అక్రమ వ్యాపారం చేసే వారు రాత్రి వేళల్లో చేస్తుంటారు.కానీ, ఇక్కడ పట్టపగలే అడ్డూ అదుపూ లేకుండా చెరువులను జేసీబీలతో తవ్వి మొరం మట్టిని ఇటుక బట్టీలు, వాణిజ్య సముదాయాలు, ప్రైవేట్ భవనాలు,రియల్ వెంచర్లు,షాపింగ్ కాంప్లెక్స్, గోదాం నిర్మాణాలకు ఒక టిప్పర్ రూ.5000 నుండి రూ.8000,ఒక ట్రాక్టర్ రూ.3000 చొప్పున అధిక రేట్లకు అమ్ముకుంటూ అనుమతులు లేకుండా అడ్డదారిలో లక్షలు దండుకుంటున్నారు.
అయినా వీరిని అడ్డుకునే నాథుడే లేకపోవడం గమనార్హం.పెద్దవూర మండలం నాయనవాని కుంట గ్రామ చెరువులో వారం రోజుల నుంచి పట్టపగలే జెసీబీలతో మొరాన్ని తవ్వి అమ్ముకుంటున్నా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.
చెరువుల్లో జేసీబీలు చేసిన పెద్ద పెద్ద గుంతలో పశువులు పడి మరణించిన దాఖలాలు ఉన్నాయని పశువుల కాపర్లు ఆరోపిస్తున్నారు.ఈమండలాల్లో జరిగే మొరంమట్టి వ్యాపారాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా విస్తరించడానికి మట్టి మాఫియా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
చెరువుల్లో మొరం,మట్టి తీయాలంటే సాధారణంగా ఇరిగేషన్,తహసీల్దారుల పర్మిషన్ తప్పనిసరి.
కానీ, ఎలాంటి పర్మిషన్ లేకుండానే కొందరు చెరువుల్లో మట్టి తవ్వకాలు జరపడం అనేక అనుమానాలకు తావిస్తుంది.
ప్రకృతి వనరులను దోచుకుంటూ,చెరువులను ధ్వసం చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదనిఎల్.
హెచ్.పి.ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమావత్ సక్రు నాయక్ అంటున్నారు.పెద్దవూర మండలంలో ఎండిపోయిన చెరువులో మట్టిని తవ్వుతూ ఇటుక బట్టీలకు సరఫరా చేస్తున్నా అధికారులకు పట్టడం లేదని,గతంలో మైనింగ్ డిపార్ట్మెంట్ కి ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.