నల్లగొండ జిల్లా: అనుముల మండల కేంద్రం హాలియా, తిరుమలగిరి (సాగర్) మండలం డొక్కల బాయి తండాలోని భారతీయ సార్వత్రిక విద్యాలయం పాఠశాలల్లో విద్యార్థులకు రాజ్యాంగ విరుద్ధంగా మతపరమైన ఛాందసవాద శిక్షణ తరగతులు బోధిస్తున్న ప్రైవేట్ స్కూల్స్ చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కొండేటి శీను డిమాండ్ చేశారు.జిల్లా కేంద్రంలో విద్యాధికారి కార్యాలయంలో డిఈఓకు వినతిపత్రం అందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థల్లో శాస్త్రీయ విద్యావిధానం,మత సామరస్యం,భారత రాజ్యాంగం,స్వతంత్ర్య పోరాటం,సమరయోధుల త్యాగాల వంటి విద్యాబోధన మాత్రమే చేయాల్సి ఉండగా,
చట్ట విరుద్ధంగా భారతీయ సార్వత్రిక విద్యాలయం పాఠశాలల్లో పాఠ్యాంశాలకు సంబంధంలేని ఆర్ఎస్ఎస్ హిందుత్వ భావజాలమైన ఛాందసవాదం,మూఢ నమ్మకాలను బాల్యంలో విద్యార్థుల మెదడులోకి బలవంతంగా చొప్పించే కుట్ర జరుగుతుందన్నారు.అంతే కాకుండా ఈ పాఠశాలల్లో వినాయక,దుర్గామాత విగ్రహాలు పెట్టి నవరాత్రి పూజలు చేస్తున్నారని ఆరోపించారు.అన్ని మతాల పిల్లలు ఉండే ఈ పాఠశాలల్లో మత సామరస్యానికి తిలోదకాలిచ్చి మతపరమైన బోధన చేస్తూ,తక్కువ జీతానికి ఇంటర్ పాస్,ఫెయిల్ అయిన వారే టీచర్స్ గా పాఠశాలలు నడిపిస్తున్నారని,వివిధ రకాల ఫీజులు,గురుకుల కోచింగ్ పేరుతో దళిత,గిరిజన పేద తల్లిదండ్రుల నుండి అదనంగా రూ.25 వేలు వసూళ్లు చేస్తూ అమాయక పేరెంట్స్ ను మోసం చేస్తూ విద్యా దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు.అధిక ఫీజులు కట్టలేక విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తే,
వత్తిడికి తట్టుకోలేక పేరెంట్స్ అతహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.పాఠశాలల యాజమాన్యంతో ఎంఈఓలు కుమ్మక్కై మామూళ్ల మత్తులో చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని,ఫీజులు రాబట్టుకోవడానికి విద్యార్థులను,తల్లిదండ్రులను అందరి ముందే హేళనగా మాట్లాడి మానసికంగా హింసిస్తూ,విద్యా వ్యాపారం చేస్తున్న భారతీయ సార్వత్రిక విద్యాలయం పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపును రద్దు చేసి, యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్తామని,చర్యలు తీసుకొని యెడల కెవిపిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.