నల్లగొండ జిల్లా:నకిరేకల్ పట్టణంలో చిరువ్యాపారుల, కొనుగోలుదారుల సౌకర్యార్థం కూరగాయలు,మాంసం విక్రయాలు ఓకేచోట జరిగేలా గత ప్రభుత్వ హయంలో ప్రారంభించిన సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ అసంపూర్తిగా నిలిచిపోవడంతో చిరు వ్యాపారులు రోడ్ల మీదనే కూరగాయలు,మాంసం విక్రయాలు చేస్తున్నారు.గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన సమీకృత మార్కెట్ పనులు ప్రారంభ దశలోనే శిధిలావస్థకు చేరుకుని ఉత్సాహ విగ్రహంలా మిగిలిపోయిందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమీకృత మార్కెట్ కోసం సుమారు 70 ఏళ్ల పాటు మనుగడలో ఉండే ప్రభుత్వ భవనాలు, గ్రంథాలయం,ఇంజనీరింగ్ భవనం,విద్యుత్ ఆఫీస్, బస్సు కేంద్రంతో పాటు చిరు వ్యాపారుల దుకాణ సముదాయ భవనాలను రాత్రి రాత్రికే కూల్చి,గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్వర్యంలో మూసి రోడ్లో రూ.6 కోట్ల 30 లక్షలతో సమీకృత మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, మార్కెట్ నిర్మాణం కోసం లోతుగా గుంతలు తవ్వి గాలికొదిలేయడంతో అటు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమై, ఇటు మార్కెట్ పూర్తికాక ప్రభుత్వ, వ్యాపార వర్గాలు ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు.ఇప్పటికైనా ప్రస్తుత ఎమ్మెల్యే,సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పూర్తి చెయ్యాలని కోరుతున్నారు.




Latest Nalgonda News