నల్లగొండ జిల్లా:మునుగోడు నియోజకవర్గ పరిధిలోని శివన్నగూడెం ప్రాజెక్టు భూ నిర్వాసితులకు మొదటి నుండీ అన్యాయం జరుగుతుందని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) నియోజకవర్గ ఇంచార్జీ పెండెం ధనుంజయ్ నేత ఆవేదన వ్యక్తం చేశారు.ఆదివారం ఆయన చెర్లగూడెం వద్ద దీక్ష చేస్తూ మరణించిన లక్ష్మమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామస్తులు గత 30 రోజుల నుంచి వారి న్యాయమైన డిమాండ్లు అయిన పునరావాసం,నష్టపరిహారం,ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం దీక్ష చేస్తున్నారని,ముక్తకంఠంతో మాకు రావాల్సిన ప్యాకేజీ ఇవ్వాలని ఇల్లు వదిలి అక్కడే పడిగాపులు కాస్తున్నారని అన్నారు.ఆరు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ తన కార్యాలయానికి పిలిపించి వారితో మాట్లాడారని,చెక్కులను ఇస్తామని చెప్పి ఇప్పటివరకు దాని ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు.
జిల్లా కలెక్టర్ మాట తప్పారని,తమకు ఇక నష్టపరిహారం రాదేమోనన్న ఆందోళనతో దీక్ష చేస్తున్న సమయంలో నాగిళ్ళ లక్ష్మమ్మ (50) పరిహారం కోసం ఆలోచిస్తూ బిపి ఎక్కువ అవ్వడంతో అక్కడే పడిపోయిందన్నారు.నిర్వాసితులు ఆమెను మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని,పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించాలని డాక్టర్లు సూచించడంతో మార్గమధ్యలో నాగిళ్ల లక్ష్మమ్మ(50) మరణించారని వాపోయారు.
ఇది కేవలం ప్రభుత్వ హత్యేనని,ఇంకెంత మంది ప్రాణాలు పోతే నష్టపరిహారం చెల్లిస్తారని ప్రశ్నించారు.చర్లగూడెం ప్రాజెక్ట్ భూ నిర్వాసితురాలైన ఒక మహిళ చనిపోతే,ఎలక్షన్ల ముందు ఎన్నో హామీలిచ్చిన తాజా,మాజీ ఎమ్మెల్యేలు కనీసం వాళ్ళని పరామర్శించడానికి మొఖం కూడ లేదని మునుగోడు బీఎస్పీ నేత పెండెం ధనుంజయ్ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఎస్పీ పార్టీ మొదటి నుండి నిర్వాసితులకు అండగా ఉందని,భవిష్యత్ లో కూడా ఉంటుందని భరోసా ఇచ్చారు.