నల్లగొండ జిల్లా:తెలంగాణ అసెంబ్లీ సాధారణ ఎన్నికల( Telangana Assembly election ) నామినేషన్ ప్రక్రియ శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన పోలీస్బందోబస్తు మధ్య నిర్వహించారు.తొలి రోజు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్దులు నామినేషన్ పై ఆసక్తి చూపకపోవడంతో నామినేషన్ల ప్రక్రియ మందకొడిగా సాగింది.
ఈ నెల 9న ప్రధాన పార్టీల అభ్యర్దులు నామినేషన్లు వేసేందుకు ముహూర్తం పెట్టుకున్నట్లు సమాచారం.ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తొలిరోజు నామినేషన్ల సమయం ముగిసేసరికి కేవలం 14 నామినేషన్లు మాత్రమే దాఖలైనట్లు తెలుస్తోంది.
అందులో ఒకట్రెండు మినహా మొత్తం ఇండిపెండెంట్ అభ్యర్దులవి కావడం గమనార్హం.నల్లగొండ నుండి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్ధి పిల్లి రామరాజు యాదవ్ తరుపున ఆయన తమ్ముడు,మిర్యాలగూడ నుండి ఇండిపెండెంట్ అభ్యర్దులుగా మల్లిడి వెంకటరామ్ రెడ్డి, ధనావత్ ఉషానాయక్, నాగార్జున సాగర్ నుండి గాదె సైదిరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా,మునుగోడు నుండి బేరి వెంకటేష్, మాధగోని వెంకటేశ్వర్లు, బుషిపాక వెంకటయ్య ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయగా దేవరకొండ,నకిరేకల్ నుండి ఎవరూ నామినేషన్ వేయలేదు.
సూర్యాపేట నుండి ప్రజావాణి పార్టీ అభ్యర్ధి లింగిడి వెంకటేశ్వర్లు,బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా ఒగ్గు వెంకన్న,తుంగతుర్తి నుండి బీఎల్ఎఫ్ అభ్యర్థిగా ఈదుల వీరపాపయ్య, కోదాడ నుండి ప్రజావాణి పార్టీ తరఫున లింగిడి వెంకటేశ్వర్లు,స్వతంత్ర అభ్యర్థిగా ఎన్ఆర్ఐ జలగం సుధీర్ అమెరికా నుండి ఆన్లైన్ ద్వారా నామినేషన్ దాఖలు చేయగా హుజూర్ నగర్ నుండి ఇంకా బోణీ చేయలేదు.
తెలంగాణలో తొలి ఆన్లైన్ నామినేషన్ వేసిన అభ్యర్ధిగా కోదాడ నుండి జలగం సుధీర్ గుర్తించబడ్డారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య,స్వతంత్ర అభ్యర్ధిగా కందడి మహిపాల్ రెడ్డి( Kandadi Mahipal Reddy ) నామినేషన్ దాఖలు చేయగా భువనగిరి నుండి నామినేషన్ వేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.అక్టోబర్ 3 నుండి 10 వరకు నామినేషన్‌లు స్వీకరిస్తారు.
ఈ నెల 30న పోలింగ్ జరుగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగనుంది.ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయాల్లో ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
నామినేషన్లను ఆన్‌లైన్‌లో పూర్తిచేసి ఆ దరఖాస్తును రిటర్నింగ్ అధికారికి భౌతికంగా సమర్పించాల్సి ఉంటుంది.నామినేషన్ల పరిశీలన నవంబర్ 13న, నామినేషన్ల ఉపసంహరణ నవంబర్ 15న,పోలింగ్ తేదీ నవంబర్ 30న ఉదయం 7 గం.ల నుంచి 5 గం.ల వరకు,13 నక్సల్స్ ప్రభావిత స్థానాల్లో సా.4 గం వరకే పోలీంగ్ నిర్వహించనున్నారు.డిసెంబర్ 3 ఓట్ల లెక్కింపుతో ఫలితాలు వెలవడనున్నాయి
.