నల్లగొండ జిల్లా:దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని చింతపల్లి మండలం కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది.యాచారం కృష్ణ(26)అనే యువకుడు కరెంటు కలెక్షన్ సరిచేయడానికని కరెంటు స్తంభం ఎక్కగా కరెంటు సరఫరా కావడంతో స్తంభంపైనే విగతాజీవిగా మారిన ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
దీనితో కుటుంబ సభ్యులు,బంధువులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు.ఈ సందర్భంగా మృతిని కుటుంబ సభ్యులు, బంధువులు మాట్లాడుతూ మృతుడు విద్యుత్ శాఖలో కరెంటు బిల్లులు కొట్టడానికి అధికారులు పెట్టుకున్న ప్రైవేట్ వ్యక్తి కావడంతో అతనికి విద్యుత్ శాఖ నుండి రావాల్సిన బెనిఫిట్స్ వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది.
నెలకు కొంత జీతంలాగా ఇచ్చేట్టు స్థానిక విద్యుత్ అధికారులు మాట్లాడుకొని కృష్ణను పెట్టుకున్నారని,అలాంటి వ్యక్తితో కేవలం కరెంట్ బిల్లులు కొట్టించడం చేయకుండా,వేలకు వేలు జీతాలు తీసుకొనే అధికారులు తాము చేయాల్సిన పనులను ప్రైవేట్ వ్యక్తులతో చేయించడం ద్వారా అనేకమంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు.అధికారులు నిర్లక్ష్యంతో కృష్ణను పోల్ ఎక్కించడమే కాకుండా అతను దిగకముందే కరెంటు ఆన్ చేయడంతో కృష్ణ అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందన్నారు.
కృష్ణకు సంవత్సరం క్రితమే పెళ్ళి కాగా ఇపుడు తన భార్య నిండు గర్భవతి అని ఆవేదన వ్యక్తం చేశారు.కృష్ణ మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని వారిని సస్పెండ్ చేసి,మృతుని కుటుంబానికి 50 లక్షల పరిహారంతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కుటుంబంలో ఐదుగురు సంతానంలో నలుగురు ఆడపిల్లల తర్వాత కృష్ణ ఐదో సంతానం కావడంతో అల్లారుముద్దుగా పెరిగిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రుల పుత్రశోకంతో,తన భర్తను విగతజీవిగా చూస్తూ కృష్ణ భార్య చేస్తున్న రోదనలతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.