విశ్వంలోనే అత్యంత చిన్న దేశాల్లో ఒకటి, ప్రపంచానికి దూరంగా ఉండేటువంటీ ద్వీపం తువాలు.( Tuvalu ) ఈ దేశం ఇప్పుడు సంచలనం సృష్టించింది.2025, ఏప్రిల్ 15న తువాలు తన మొట్టమొదటి ఏటీఎంను( ATM ) ప్రారంభించింది.ఊహించగలరా కేవలం 11,200 మంది జనాభా ఉన్న ఈ దేశంలో ఇంతవరకు ఒక్క ఏటీఎం కూడా లేదు.
అన్నీ నగదు లావాదేవీలే.అలాంటిది ఇప్పుడు ఏకంగా ఏటీఎమ్ రావడం నిజంగా చరిత్రే.
ఫునాఫుటి ప్రధాన ద్వీపంలో అట్టహాసంగా ఈ ఏటీఎం ప్రారంభోత్సవం జరిగింది.తువాలు ప్రధానమంత్రి ఫెలెటి టెయో( Prime Minister Feleti Teo ) స్వయంగా ఈ వేడుకకు నాయకత్వం వహించారు.
స్థానిక నాయకులు, ముఖ్య అతిథులు ఈ సంబరంలో పాల్గొన్నారు.ఈ చారిత్రాత్మక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ భారీ చాక్లెట్ కేక్ కట్ చేశారు.ఈ ఘటనను ప్రధాని “చారిత్రాత్మక విజయం”గా అభివర్ణించారు.దేశం మరింత ముందుకు వెళ్లడానికి ఇదొక పెద్ద ముందడుగు అని కొనియాడారు.

నేషనల్ బ్యాంక్ ఆఫ్ తువాలు( National Bank of Tuvalu ) మేనేజర్ సియోస్ టెయో మాట్లాడుతూ, ఈ ఏటీఎం ప్రజలు డబ్బును వాడుకునే విధానాన్ని పూర్తిగా మారుస్తుందని అన్నారు.దీన్ని “విప్లవాత్మక మార్పు”గా అభివర్ణిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.అంతేకాదు, ప్రజలకు సులభంగా, సురక్షితంగా డబ్బును పొందే అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు.
పసిఫిక్ టెక్నాలజీ లిమిటెడ్ సహకారంతో ఈ ఏటీఎం సాధ్యమైంది.
ఈ సంస్థ ప్రతినిధి నిసార్ అలీ మాట్లాడుతూ, ఈ యంత్రం టువాలు ప్రజలకు ఆధునిక, నమ్మకమైన బ్యాంకింగ్ సేవలను పరిచయం చేస్తుందని అన్నారు.ఇది డిజిటల్ సేవలను ప్రజలు నమ్మేలా చేస్తుందని, ఆర్థిక భద్రతను మెరుగుపరుస్తుందని ఆయన పేర్కొన్నారు.

తువాలు దేశం పసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియా, హవాయి మధ్య కేవలం 10 చదరపు మైళ్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న తొమ్మిది చిన్న ద్వీపాల సమూహం.ఈ దేశానికి వచ్చే పర్యాటకులు చాలా తక్కువ.2023లో కేవలం 3,000 మంది పర్యాటకులు మాత్రమే వచ్చారు.ఫునాఫుటిలో మాత్రమే విమానాశ్రయం ఉంది.
ఫిజీ నుంచి పరిమిత విమానాలు మాత్రమే ఇక్కడికి వస్తాయి.స్థానికులు ద్వీపాల మధ్య ప్రయాణించడానికి ఫెర్రీలను ఉపయోగిస్తారు.
క్లైమేట్ ఛేంజ్ కారణంగా తువాలు తీవ్రమైన ప్రమాదాలను ఎదుర్కొంటోంది.సముద్ర మట్టాలు పెరగడం భూమిని కుంచించుకుపోయేలా చేస్తోంది.పంటలను నాశనం చేస్తోంది.2021లో విదేశాంగ మంత్రి సైమన్ కోఫే సముద్రపు నీటిలో నిలబడి ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.పర్యావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న అత్యవసర పరిస్థితిని ప్రపంచానికి చాటి చెప్పారు.ఇప్పుడు, తన మొదటి ఏటీఎం ద్వారా తువాలు ఆశాజనకమైన భవిష్యత్తులోకి అడుగు పెడుతోంది.