నల్లగొండ జిల్లా:ఆరుగాలం కష్టించి పంట పండించే అన్నదాతకు అనునిత్యం ఆవేదనే మిగులుతుంది.ప్రభుత్వాల పనితీరు, ప్రకృతి ప్రకోపం రైతన్నను కొలుకోకుండా చేస్తున్నాయి.
ప్రస్తుతం వరి కోతలు ముగింపు దశకు చేరుకున్నాయి.ధాన్యం కళ్ళాలోకి చేరుకుంటుంది.
ఇక ఇంత కాలం పడ్డ కష్టానికి ఫలితం దక్కనుందని ఆశపడ్డ అన్నదాతను అకాల మిగ్ జామ్ తుఫాన్( Cyclone Michaung ) అమాంతం మింగేస్తుందని నల్గొండ జిల్లా వేములపల్లి మండలం పరిధిలోని ఆమనగల్లు,సల్కనూర్ గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం పూర్తిగా నీటి మునిగిందని,కాంటాలు సకాలంలో కాకపోవడంతో చేతికందిన ధాన్యం వర్షార్పణం అయిందని అన్నదాతలు వాపోతున్నారు.
సరైన సమయంలో వర్షాలు లేక, విద్యుత్ సరఫరా సక్రమంగా ఇవ్వక,సాగర్ జలాలు విడుదల చేయక చాలా వరకు నష్టపోయిన రైతుకు,ఈ సారి పంటకు వ్యాపించిన ఆకుచుట్టు పురుగు నివారణ సవాల్ గా మారిందని,ఒక్కో రైతు మూడు నుంచి నాలుగు సార్లు విపరీతమైన మందులు వాడడంతో దీనిప్రభావం రైతుల( Farmers ) మీద దారుణంగా పడిందని, అన్ని ఆటుపోట్లను తట్టుకుని పంట పండించి మార్కట్ కు తీసుకువచ్చిన రైతులు మార్కెట్లలో,ఐకేపీ సెంటర్ల వద్ద ధాన్యాన్ని అమ్ముకొని ఆరుగాలం చమటోడ్చిన కష్టానికి ప్రతిఫలం అందేలోగా ఈ తుఫాన్ దెబ్బకు రైతులు కుదేలవుతున్నారని,భారీ వర్షాలతో( heavy rains ) కళ్ల ముందే వాళ్ళ కష్టం కొట్టుకుపోతుంటే కాపాడుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావని కన్నీటి పర్యంతమయ్యారు.కనుక అధికారులు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని తడిసిన ధాన్యానికి ఎటువంటి కొర్రీలు (కోతలు) పెట్టకుండా కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.