నల్లగొండ జిల్లా:నకిరేకల్, మునుగోడు,నల్లగొండ నియోజకవర్గాలకు లక్షన్నర ఎకరాలకు సాగునీటిని అందించే బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు సుదీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురవుతోందని ముందు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తికి రూ.2000 కోట్లు, బ్రాహ్మణ వెల్లెంల-ఉదయ సముద్రం ప్రాజెక్టుకు రూ.1000 కోట్లు కేటాయించి, ఎప్పటి వరకు పూర్తయ్యేది బహిరంగంగా ప్రకటించాలని ప్రజా పోరాట సమితి (పీఆర్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అన్నారు.గత ప్రభుత్వం కేవలం ట్రయల్ రన్ మాత్రమే వేసింది.
వాస్తవికంగా బ్రాహ్మణ వెల్లెంలలో ప్రాజెక్టుకు సాగునీరు రావాలి అంటే ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తి కావాలి.నేటికీ 43 కిలోమీటర్ల దూరంలో పూర్తి కావలసిన సొరంగమార్గం 33 కిలోమీటర్ల దూరంలోనే పనులు ఆగిపోయాయి.గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రూ.2000 కోట్లు కేటాయించనందున ఈ భారీ ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు.రూ.2000 కోట్లు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించకుండా ఈ ప్రాజెక్టులోకి సాగునీరు రాదన్నారు.సొరంగ మార్గం పూర్తి చేయకపోతే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం లాగే ట్రయల్ రన్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయన్నారు.దీంతో ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా ప్రజలు నమ్మరన్నారు.అందుకోసం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో రూ.2000 కోట్లు కేటాయించి సొరంగ మార్గాన్ని పూర్తి చేయాలన్నారు.తక్షణం రూ.1000 కోట్లు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు కేటాయించి రైతాంగం వద్ద తీసుకున్న భూములకు నష్టపరిహారం చెల్లించాలన్నారు.డిస్ట్రిబ్యూటరీ కాలువలను పూర్తి చేయాలని,దానిని సమగ్రంగా పూర్తి చేసేందుకు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు.“కుండలున్న గాసం కుండల్నే ఉండాలి పోరగాడు మాత్రం కుడుములాగా ఉండాలంటే కుదరదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తక్షణం బడ్జెట్లో ఎస్ఎల్బీసి సొరంగ మార్గానికి రూ.2000 కోట్లు,బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తికి అంటే అందులో ప్రధానంగా రైతాంగానికి చెల్లించవలసిన భూముల నష్టపరిహారం, డిస్ట్రిబ్యూటరీ కాలువల పూర్తికి రూ.1000 కోట్లు కేటాయించి ప్రాజెక్తును పూర్తి చేసి దీని గురించి మాట్లాడినప్పుడే ప్రజలు ప్రస్తుత ప్రభుత్వాన్ని విశ్వసిస్తారని తెలిపారు
.