నల్లగొండ జిల్లా: జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీలో అంతా తానై చక్రం తిప్పుతున్న ఓ వ్యక్తి గురించి ఉన్నతాధికారులే నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.మెడికల్ కాలేజీలో స్వీపర్ ని అటెండర్ చేయాలన్నా అటెండర్ ని అకౌంటెంట్ చేయాలన్నా ఆయన రైట్ అంటే రైట్,కాదంటే కాదంట.
అంతే కాదండోయ్ అందులో కొత్త ఉద్యోగాలు కావాలన్నా,ఫైల్స్ ముందుకు సాగాలన్నా, ఎంప్లాయిస్ నుంచి ఏజెన్సీల వరకు ఆయన్ను ముందుగా ప్రసన్నం చేసుకోవాలనే టాక్ కూడా నడుస్తోంది.ఆయన తలుచుకుంటే మెడికల్ కాలేజ్ లో అన్ని ఫైల్స్ ఓకే అవుతాయని,మెడికల్ కాలేజ్ కి ఏ కొటేషన్ తీసుకోవాలన్నా,ఏ పర్చేస్ జరగాలన్నా ముందుగా ఆయన చేతులు ఖచ్చితంగా తడపాల్సిందేనట.
అతను అనుకున్న పని కోసం గతంలో మంత్రి మాటలు కూడా బేఖాతర్ చేసేవారని తెలుస్తోంది.ఇవన్నీ వింటుంటే అతనేదో జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నతాధికారి అనుకుంటే సిరంజ్ లో సిరఫ్ నింపినట్లే.
అతను అధికారి కాదు కదా కనీసం ప్రభుత్వ ఉద్యోగి కూడా కాదు.మెడికల్ కళాశాలలో ఒక మామూలు ఔట్సోర్సింగ్ ఉద్యోగి.అవును మీరు చదువుతున్నది అక్షరాలా నిజమే.కానీ,అక్కడ ఆయన ఎంత చెబితే అంతేనట.
ఆయన ఉండే ఛాంబర్ చూస్తే అందరికీ మతిపోవాల్సిందే.మెడికల్ కాలేజీ సూపరిండెంట్ ఛాంబర్ కూడా ఆయన ఛాంబర్ కింద దిగదుడుపే.
ఎంత పెద్ద ఉద్యోగి అయినా టైంకి రావాలి.
కానీ,ఆయనకు మాత్రం సమయపాలన అనేదే ఉండదట.
ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్లొచ్చు.అయినా అడిగేవారే ఉండరట.
అంతే కాదు సుమా…గత కొన్నేళ్లుగా పాత జీతంతో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి జీతాలు పెరగకుండా చేస్తే వారు పూర్తి ఫైల్ తో కోర్టు మెట్లు ఎక్కడం ఆయన ఘన కార్యమేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి.అతనిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా, అవినీతికి,అక్రమాలకు పాల్పడుతున్నాడని తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా అధికారులే ఆయనను వెనకేసుకుని రావడానికి గల కారణాలు ఏంటో అర్థంకాక మెడికల్ కళాశాల ఉద్యోగులు, సిబ్బంది ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
అయితే గతంలో విచారణ చేసి కలెక్టర్ ఆదేశాలతో పక్కన పెట్టిన ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి మళ్లీ డ్యూటీలో చేరడం,కి్రోల్ గా మారడం ఎలా సాధ్యమైందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.వివిధ అక్రమాలకు పాల్పడినా ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని,ఇతని వెనుకాల దాగి ఉన్న శక్తులు ఎవరో అర్దంకాక కింది స్థాయి సిబ్బంది తలల పట్టుకుంటున్నారు.
ఇప్పటికైనా నల్లగొండ మెడికల్ కాలేజీలో అన్ని తానై ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరిస్తున్న సదరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగిపై సమగ్ర విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.