నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాఫిక్ము నుగోడు ఉప ఎన్నిక.ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీల కోలాహలం మొదలైన సంగతి తెలిసిందే.
ఇప్పుడు తాజాగా ఇందులోకి వైఎస్సార్ టిపి కూడా చేరిపోయినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.మునుగోడు ఉప ఎన్నికలో వైఎస్ షర్మిల ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ టిపి బరిలో నిలవనుందని తెలుస్తోంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న ప్రజాప్రస్థాన పాదయాత్రలో వైఎస్ షర్మిల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి ధ్రువీకరించినట్లు కూడా చర్చ జరుగుతోంది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పినట్లు సమాచారం.మునుగోడులో సిట్టింగ్ పార్టీ కాంగ్రేస్,అధికారపార్టీ టీఆర్ఎస్,రాజీనామా చేసి ఉప ఎన్నికకు కారణమైన మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీ,మూడు పార్టీలు నువ్వా నేనా అన్న రేంజ్ లో గ్రౌండ్ వర్క్ చేస్తుంటే,బీఎస్పీ సైతం పోరుకు సై అంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మునుగోడు నియోజకవర్గ పరిధిలో బీసీ,ఎస్సి,ఎస్టీ,మైనార్టీ ఓట్లు అధికంగా ఉండడంతో బీసీ ఐక్య వేదిక ద్వారా కూడా బీసీలు ఏకతాటిపైకి వచ్చి ఎన్నికల బరిలో నిలవాలనే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.తాజాగా వైఎస్సార్ టిపి కూడా కాలు దువ్వడంతో మునుగోడు ఉప ఎన్నిక పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.