నల్లగొండ జిల్లా:గ్యాస్ వినియోగదారులు( Gas consumers ) వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని పుకార్లు రావడంతో దేవరకొండ పట్టణ మరియు గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈకేవైసీ లేకుంటే రూ.500ల గ్యాస్ రాదని వదంతులు సృష్టించడంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు దీరుతున్నారు.దేవరకొండ మండల పరిధి గ్రామాల నుంచి ఈకేవైసీ కోసం ఏజెన్సీల వద్దకు వందలాదిగా వస్తున్నారు.
దేవరకొండ లోని గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉదయం 8 గంటలకే క్యూ లైన్ లో ఉంటున్నారు.ఈకేవైసీ వెంటనే చేసుకోవాలని పెద్దఎత్తున ప్రచారం జరుగుతుండటంతో వృద్ధులు,మహిళలు ఏజెన్సీలకు చేరుకుంటున్నారు.
గ్యాస్ కనెక్షన్ ( Gas connection )ఎవరి పేరున ఉంటే వారే ఈకేవైసీ చేసుకోవాల్సి ఉండడంతోకొందరు రూ.వెయ్యి పెట్టి అద్దె ఆటోల్లో గ్రామాల నుంచి ఉదయం 7గంటలకే వచ్చి 8 గంటల కల్లా ఏజెన్సీకి చేరుతున్నారు.వదంతులు నమ్ముతూ ప్రజలు కేవైసీ కోసం వస్తున్నారు.నిర్వాహకులు మాత్రం ఇది నిరంతర ప్రక్రియని,ఈకేవైసీ ఎప్పుడైనా చేయించుకోవచ్చని చెబుతున్నా పట్టించుకోవడం లేదు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న రూ.500లకు గ్యాస్ ఇస్తుందో లేదోనని వినియోగదారులు ఏజెన్సీల వద్దకు పరుగు పెడుతున్నారు.దీనిపై తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని, వినియోగదారులంతా ఒకేసారి వస్తుండడంతో సేవల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు వాపోతున్నారు.ఈకేవైసీ నిరంతర ప్రక్రియని ఏజెన్సీల వద్ద బోర్డులు పెట్టినా ప్రజలు పట్టించుకోవడం లేదంటున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా రూ.500 లకే గ్యాస్ ఇస్తుందని,ఈకేవైసీ చేసుకున్న వారికే గ్యాస్ సబ్సిడీ వస్తుందనే పుకార్లతోనే ఇలా క్యూ కడుతున్నారు.ఇప్పటికైనా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని గ్యాస్ ఏజెన్సీల వారు కోరుతున్నారు.