నల్లగొండ జిల్లా: భూ తగాదాల నేపథ్యంలో ఓ దళిత మహిళపై గ్రామ సర్పంచ్ మరియు కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా దాడి చేసి, కులం పేరుతో దూషిస్తూ, హేళన చేస్తూ,అత్యంత క్రూరంగా నోటిలో పళ్ళు ఊడి రక్తస్రావం జరిగేలా కొట్టిన అమానవీయ ఘటన నల్లగొండ జిల్లాలో శనివారం జరిగింది.బాధిత మహిళ కథనం ప్రకారం నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం వద్దిపట్ల గ్రామానికి చెందిన దళిత మహిళ ఎనిక శారద, గ్రామ సర్పంచ్ పాలకూర ధనమ్మ కుటుంబాల మధ్య గత మూడు నెలలు నుండి భూ వివాదం నడుస్తోంది.
ఈ విషయంలో ఒకరిపై ఒకరు పలుమార్లు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టుకున్నారు.అప్పటి నుండి ఆ భూమి ఎవరూ సేద్యం చేయకుండా పడావుపడ్డది.శనివారం దళిత మహిళ ఎనిక శారద సేద్యం చేయడానికి భూమి దగ్గరికి వెళ్లగా పక్కనే తన భూమి దగ్గర ఉన్న సర్పంచ్ పాలకూర ధనమ్మ మరియు భర్త ఆంజనేయులు ఆమెతో గొడవకు దిగారు.ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో దళిత మహిళపై సర్పంచ్ భర్త పాలకూర ఆంజనేయులు, సర్పంచ్ ధనమ్మ అమానుషంగా దాడి చేసి పళ్ళు ఊడేలా కొట్టారు.
పక్కనే ఉన్న శారద భర్త వెంకటేశర్లు 108 అంబులెన్స్ కి కాల్ చేసి దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తరలించి,అనంతరం గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ విషయంపై గుడిపల్లి ఎస్ఐ రంజిత్ రెడ్డిని వివరణ కోరగా…ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని, ఘటనపై ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశామని,డిఎస్పి ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు జరుగుతుందని తెలిపారు.