నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోనే ప్రాముఖ్యత సంతరించుకున్న నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో రాత్రి మాత్రమే కాదు పగలు కూడా వీధి దీపాలు వెలుగుతూ పట్టణ ప్రజలకు దారి చూపుతున్నాయి.పగలు వీధి లైట్లు ఎందుకని అనుకుంటున్నారా ఇక్కడ విద్యుత్,మున్సిపల్ అధికారులు అవగాహనకు వచ్చి రాత్రి మాత్రమే కాదు పొద్దంతా ప్రజలకు చీకటి లేకుండా చేయాలని ఆఫ్ చేయకుండా నిరంతరం వెలుగులు పంచుతున్నారు.
కానీ,ఈ విషయం తెలియక పట్టణ ప్రజలు రెండు శాఖల అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇదేంటని ప్రజలను అడిగే ప్రయత్నం చేస్తే పట్టపగలే విద్యుత్ దీపాలు వెలుగుతున్నా విద్యుత్ శాఖ,మున్సిపల్ శాఖతో కుమ్మక్కై విద్యుత్ ను వృధా చేస్తూ విద్యుత్ శాఖను అప్పుల కూపంలోకి నెట్టి,ఆ భారాన్ని కూడా ప్రజలపై వేసేందుకు చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.
విద్యుత్ ను ఆదా చేసి కాపాడాల్సిన అధికారులు మున్సిపాలిటీ మొత్తం పట్టపగలే లైట్లు వెలుగుతున్నా కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదని వాపోతున్నారు.విద్యుత్ అధికారుల పర్యవేక్షణ లోపం,మున్సిపల్ నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ వృధా అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా పగలు,రాత్రి అనే తేడా లేకుండా నిత్యం వెలుగుతుండడంతో వందలాది యూనిట్ల విద్యుత్ వృథా అవుతూ ఫలితంగా విద్యుత్ శాఖ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని,ఆ నష్టాన్ని తిరిగి ప్రజలపైనే రుద్దుతారని అంటున్నారు.
ఇప్పటికైనా రెండు శాఖల అధికారులు స్పందించి వీధి దీపాలకు ప్రత్యేక లైన్లతో ఆన్ ఆఫ్ స్విచ్‌లను ఏర్పాటు చేస్తేనే రాత్రి పూట ఆన్ చేసి ఉదయం పూట ఆఫ్ చేస్తేనే ఈసమస్యకు పరిష్కారం లభిస్తుందని, లేకుంటే ప్రభుత్వం నిరంతరం విద్యుత్‌ను అందించడానికి వేల కోట్ల వెచ్చిస్తున్నా ఉపయోగం లేకుండా పోతుందని భావిస్తున్నారు.
విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన వీధి దీపాలు మున్సిపల్ శాఖ పరిధిలో ఉంటాయని లైన్మెన్ సీతారాములు అన్నారు.వాళ్ళు వాటిని ఆన్ ఆఫ్ చేయట్లేదు.
వీధిలైట్ల దగ్గర ఉండే విద్యుత్ మీటరు నడుస్తూనే ఉంటుంది.ఆ బిల్లులు మున్సిపాలిటీ వారు చెల్లించవలసి ఉంటుంది.
ఇదివరకు “మీటర్ పాయింట్” దగ్గర డిజిటల్ బాక్స్ ఆన్ ఆఫ్ ఉండేది.అవి పని చేయడం లేదు.
మున్సిపాలిటీ వారు అవి మార్చడం లేదన్నారు.