నల్లగొండ జిల్లా: తెలంగాణలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతా వరణ శాఖ వెల్లడించింది.పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.
హైదరాబాద్‌లో రానున్న 3 రోజులపాటు అంటే జూలై 25-27 వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.ఈ మూడు రోజుల పాటు వాతావరణ శాఖ మోడల్ ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని భారత వాతావరణ తెలిపింది.దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదురోజుల పాటు వర్షాలు కురవనున్నాయి.
అయితే తెలంగాణ వ్యాప్తంగా ఈ నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో పాటు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధి కారులు తెలిపారు.ముఖ్యంగా తెలంగాణలో మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
అలాగే మిగిలిన జిల్లాల్లోనూ మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి.ఈ నాలుగు రోజులు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.అయితే హైదరాబాద్‌లో ఇప్పటికే వర్షం మొదలవ్వడంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను డైవర్ట్ కూడా చేయడం జరిగింది.భారీగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో నగరవాసులు భీతిల్లిపోతున్నారు.
మరో మూడు గంటలపాటు ఇలాగే వర్షం కురుస్తుందని అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దంటూ జీహెచ్ఎంసీ అలెర్ట్ చేసింది.
ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో బుధవారం నుంచి గురువారం ఉదయం వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
ఈ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్,జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్,భూపాలపల్లి, ములుగు,సిద్దిపేట, భువనగిరి,రంగాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
ఆయా జిల్లాలకు ఆరెంజ్,ఎల్లో అలర్ట్ ప్రకటించింది.