నల్లగొండ జిల్లా:గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్ ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ శివారులో పట్టణ పేద ప్రజల కోసం నిర్మించిన 560 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను శనివారం సిపిఎం బృందంతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరేడు సంవత్సరాల క్రితం పేద ప్రజల కోసం డబుల్ బెడ్ ఇండ్లు నిర్మించారని, అక్కడ మౌలిక వసతులు లేకపోవడంతో పంపిణీ చేయలేదని,దీంతో ఆ ఇండ్లు శిధిలావస్థలో చేరుకున్నాయన్నారు.అప్పటినుండి ఆ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం ఆధ్వర్యంలో అనేక ఆందోళన చేశామని గుర్తు చేశారు.
ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో ఆ ఇండ్ల విషయంపై పాలకులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఇండ్లు వృధాగా పడి ఉన్నాయని,వాటిని వెంటనే పేద ప్రజలకు పంపిణీ చేయాలన్నారు.
గత ప్రభుత్వంలో లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారని,ఆ లబ్ధిదారులకైన ఇండ్లు కేటాయించాలని,లేకపోతే ప్రస్తుత ప్రభుత్వం లబ్ధిదారులను గుర్తించి వెంటనే వారికి ఇండ్లను అందించాలని డిమాండ్ చేశారు.అక్కడ రోడ్లు, డ్రైనేజీ,వీధి దీపాలు, మంచినీటి సౌకర్యం వెంటనే కల్పించాలని కోరారు.
దానికి అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేయాలని చెప్పారు.యుద్ధ ప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేద ప్రజలకు అందించి ఆదుకోవాలని అన్నారు.
పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇండ్ల పరిశీలన చేస్తున్నామని,వీటిని పంపిణీ చేయాలని సోమవారం మండల, జిల్లా కేంద్రాలలో సంబంధిత అధికారులు కలిసి వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్,సిపిఎం టూ టౌన్ కార్యదర్శి భవాండ్ల పాండు,మండల కార్యదర్శి మూడవత్ రవి నాయక్,జిల్లా నాయకులు రాగిరెడ్డి మంగారెడ్డి, రేమిడల పరుశురాములు, నాయకులు తిరుపతి రామ్మూర్తి,ఎండి అంజాద్, గోవర్దనా,కోటిరెడ్డి,కోడిరెక్క మల్లయ్య,కందుకూరి రమేష్,శరబ్ రెడ్డి,రుద్ర సైదులు తదితరులు పాల్గొన్నారు.