నల్లగొండ జిల్లా:మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడ మండలం ఎస్.లింగోటం గ్రామంలోని మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని మర్రిబాయి తండా వద్ద గురువారం మిషన్ భగీరథలో పని చేస్తున్న ఇద్దరు యువకులు విద్యుద్ఘాతంతో అరుణ్ కుమార్, ప్రశాంత్ మృతి చెందగా,లింగయ్య,వంశీలు తీవ్రంగ గాయపడిన విషయం తెలిసిందే.దీంతో రాఘవ కన్స్ట్రక్షన్ లైసెన్సును రద్దు చేసి,షాక్ సర్క్యూట్‌కు కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉదయం సర్పంచ్ అంగిరేకుల పాండు ఆధ్వర్యంలో మృతుల కుటుంబాలతో పాటు గ్రామస్తులు మర్రిగూడ మండలం ఎస్.లింగోటం గ్రామంలోని మిషన్ భగీరథ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పాండు మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తులు రాఘవా కన్స్ట్రక్షన్ వారి నిర్లక్ష్యం కారణంగా మృత్యువాత పడితే కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాలను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుటుంబాలకు ఆధారమైన ఇద్దరు యువకులు ప్రమాదంలో మృతి చెందితే తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న సదరు సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.మృతి చెందిన బాధిత కుటుంబాలకు సంస్థ నుండి రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన చేపడతామని సర్పంచ్,మృతుల కుటుంబ సభ్యులు,గ్రామస్తులు తేల్చిచెప్పడంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.







