నల్లగొండ జిల్లా:ప్రభుత్వ అనుమతులు లేని ఎస్పిఆర్ పాఠశాల( SPR School )ను తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఎలాంటి అనుమతులు లేకుండా నల్గొండ జిల్లా కేంద్రంలో దేవరకొండ రోడ్( Devarkonda )లో ఎస్పిఆర్ హైస్కూల్ పేరుమీద పాఠశాలను నడుపుతున్నారని,దీనికి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవన్నారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న పాఠశాల యజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకొని,విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని విద్యాశాఖ అధికారిని కోరారు.తన ఇష్టానుసారంగా ప్రైవేట్ పాఠశాలలను నెలకొల్పి పేద విద్యార్థుల నుండి లక్షల రూపాయలను దండుకుంటున్న ప్రైవేట్ పాఠశాలల యజమాన్యం పైన జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేట్ పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని,తక్షణమే జిల్లా కలెక్టర్ చొరవచూపి ఇలాంటివి ఎక్కడున్నా తక్షణమే సీజ్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు,విద్యార్దులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.