కాకరేపుతున్న ఎమ్మెల్సీ ఉపఎన్నికలు..!

నల్లగొండ జిల్లా:నల్గొండ, ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికకు పోలింగ్ తేదీ దగ్గర పడడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల పరిస్థితి ఉత్కంఠ భరితంగా మారింది.ఈ ఉపఎన్నిక బరిలో ప్రధాన పార్టీల నుండే కాక భారీ సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 52 మంది పోటీలో ఉండడం గమనార్హం.ఇది ప్రధాన పార్టీలకు పరీక్షగా మారింది,మే 27వ తేదీన జరగనున్న ఈ ఎన్నికల్లో 4.63 లక్షల మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.ఈ ఎమ్మెల్సీ స్థానానికి 2021లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు.అయితే గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొంది తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.

 Mlc By-elections In Progress, Mlc By-elections , Palla Rajeshwar Reddy As Mla-TeluguStop.com

మూడు ఉమ్మడి జిల్లాల్లో 12 విభజిత జిల్లాలు ఉండగా 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది.ఇందులో 2,87,007 మంది పురుషులు కాగా, 1,74,794 మంది మహిళలు,ఇతరులు ఉన్నారు.

ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన వ్యవహరిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా,మరో ఎన్నికకు సిద్ధమయ్యారు పట్టభద్రుల ఓటర్లు.

గతంలో కంటే ఈ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం జనరల్ ఎలక్షన్స్ రేంజ్ లో హోరెత్తుతోంది.సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్‌ఎస్‌,ఈసారి ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్‌,తన పట్టు నిలుపుకోవాలని బీజేపీ తహతహలాడుతున్నాయి.

ప్రచారానికి ఒక్క రోజు గడువు ఉండడంతో అభ్యర్థుల తరపున కీలక నేతలు రంగంలోకి దిగారు.గ్రూపు కాల్,సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు.పాగా వేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న రెండోస్థానంలో నిలిచారు.

దీంతో ఈ స్థానంలో ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో తీన్మార్ మల్లన్నను పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించింది.తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ఉమ్మడి జిల్లాల మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ,సీతక్కతో పాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు,కీలక నేతలు ప్రచారం సాగిస్తున్నారు.

ఇప్పటికే నియోజకవర్గస్థాయి పట్టభద్రుల సదస్సులను నిర్వహించారు.లెఫ్ట్ పార్టీలు,టీజేఎస్ పార్టీ, మేధావివర్గం, విద్యావంతులు,ఉద్యోగ, ఉపాధ్యాయ,నిరుద్యోగ,వివిధ కుల సంఘాలు,రిటైర్డ్ ఉద్యోగులు,బార్ అసోసియేషన్లు కాంగ్రెస్ అభ్యర్ధి మల్లన్నకు మద్దతుగా ప్రచారంలో ఉన్నాయి.

ఎలాగైనా ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిచి తమ ఆధిపత్యాన్ని చాటాలని కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు.సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ తంటాలు ఈ పట్టభద్రుల నియోజక వర్గం ఏర్పాటైన తర్వాత వరుసగా గెలుస్తూ వచ్చిన బీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికలోనూ తన సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు నానా తంటాలు పడుతుంది.

రాష్ట్రంలో అధికారం కోల్పోయి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న తరుణంలో వచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత వచ్చిందని చూపే ప్రయత్నంలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు.పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపు కోసం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రంగంలోకి దిగారు.

ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కీలక నేతలను ఇన్ చార్జీలుగా పార్టీ అధిష్టానం నియమించింది.ఈ సీటును దక్కించుకోవడం ద్వారా ప్రశ్నించే ప్రతిపక్షంగా తాము పనిచేస్తామని గులాబీ నేతలు చెబుతున్నారు.

పట్టభద్రుల్లోనూ బలమైన ఓటు బ్యాంకు కోసం బీజేపీ ఆరాట పడుతుంది.పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటును గెలవాలనే లక్ష్యంతో బీజేపీ అగ్రనేతలు ప్రచార పర్వంలోకి దిగారు.

బీజేపీ నేత ఈటెల రాజేందర్ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి గెలుపునకు శ్రమిస్తున్నారు.రాష్ట్రంలో బీజేపీ బలపడిందని, పార్లమెంటు ఎన్నికల్లో తమదే పైచేయిగా చెబుతున్న బీజేపీ నేతలు, పట్టభద్రుల ఆదరణ కూడా తమకే ఉందని నిరూపించే సంకల్పంతో కాషాయ కంకణం కట్టుకున్నారు.

ఇంకా పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా బలంగానే ప్రచారం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ ఉపఎన్నిక మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో పోరు ఆసక్తికరంగా మారింది.

పోలింగ్ తేదీ సమీపిస్తుందడంతో అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.అయితే పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో,విద్యావంతుల విచక్షణా జ్ఞానం ఎవరిని అందలం ఎక్కిస్తుందో తెలియాలంటే జూన్ 5 వరకు ఎదురు చూడక తప్పదు మరి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube