నల్లగొండ జిల్లా: నందికొండ మున్సిపాలిటీ అంతులేని అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని,ఇక్కడ ఏ పని కావాలన్నా సిబ్బంది చెయ్యి తడపకపోతే ఇబ్బంది తప్పదు.ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పని కావాలన్నా ఇన్సూరెన్స్, పెన్షన్,ఆధార్‌కార్డు,బీమా దేనికైనా బర్త్,డెత్ సర్టిఫికెట్స్ కావాల్సిందేనని ఇటీవల ప్రజా పాలనకు సంబంధించిన దరఖాస్తులకు కూడా ఆధార్ కార్డుల్లో మార్పులు,చేర్పులు,రేషన్ కార్డులకు డెత్,బర్త్ సర్టిఫికెట్ల అవసరం కావడంతో ఇదే అదునుగా మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పైసా వసూల్ కి తెగబడ్డారని,ఒక్కోదానికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి రూ.5 వేల నుండి రూ.20 వేల వరకు ఇస్తేనే పని చేస్తారని,లేదంటే ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపిస్తారని బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు.
ముడుపులు ఇవ్వకుంటే ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్పత్రి నుండి డెత్,బర్త్‌లకు సంబంధించిన సమాచారం నిరంతరం మున్సిపాలిటీకి వస్తున్నా మాకు సమాచారం అందట్లేదనో లేదా సిబ్బంది బయటికి వెళ్లారనో రకరకాల సాకులు చెప్పి ప్రజలను వెనక్కి పంపిస్తున్నారని, చేసేదేమీ లేక,ఎవరికీ చెప్పుకోలేక అడిగిన పైసలు ఇచ్చి పని చేయించుకోక తప్పడం లేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అర్దం చేసుకొని అడిగినంత సమర్పిస్తే మాత్రం గంటల వ్యవధిలోని సర్టిఫికెట్లను చేతిలో పెడుతున్నారని వాపోతున్నారు.
ఎవరైనా సర్టిఫికెట్ కోసం వెళ్తే మీసేవలో దరఖాస్తు చేయాలని ఓసారి, ఫాం-2,ఫాం-4 కొనుక్కోవాలని మరోసారి, ఫైల్‌కు సంబంధించిన జీరాక్స్‌లు తేవాలని ఇంకోసారి ఆఫిస్ చుట్టూ తిప్పుకుంటూ వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు.ఉన్నతాధికారులు,ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో మున్సిపల్ సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాటగా రెచ్చిపోతున్నారని అంటున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని నందికొండ మున్సిపాలిటీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని,లేదంటే ప్రజలను వసూళ్ల పేరుతో పీల్చి పిప్పి చేస్తారని ఆందోళన చెందుతున్నారు.