నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ భవనాలు దశాబ్దాల క్రితం నిర్ణించినవి కావడంతో శిథిలావస్థకు చేరి కూలిపోవడానికి సిద్దంగా ఉండి,స్లాబ్ లు పెచ్చులు ఊడుతూ,గోడలపై పిచ్చిమొక్కలు మొలిచి, శ్లాబ్‌ల ఇనుప చువ్వలు తేలి వర్షాలకు కురుస్తూ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆయా శాఖల ఉద్యోగులు,సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.వర్షాలకు రికార్డులు తడుస్తున్నా ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నపరిస్థితి నెలకొంది.
కొన్ని కార్యాలయాల్లో ఫ్యాన్ కింద విధులు నిర్వహించాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.అక్కడకు వివిధ పనులపై వచ్చే ప్రజలు భవనాల పరిస్థితి చూసి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు.
అధికారులకే దిక్కులేకుంటే తమకు ఇంకేం పరిష్కారం చూపుతారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.జిల్లాలో అత్యధిక రాబడి ఇచ్చే శాఖ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం.
ఆ కార్యాలయం బయట నుంచి చూస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది.సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం శిథిలాస్థకు చేరిన అదే కార్యాలయంలో విధులు కొనసాగిస్తూ రిజిస్ట్రేషన్లు జరుపుతున్నారు.
వందలాది ప్రజలు తమ భూములను రిజిస్ట్రేషన్ చేయించుట కొరకు వచ్చి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పని ముగించుకొని వెళ్తున్నారు.గతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయంపై పత్రికల్లో ఎన్నో కథనాలు వచ్చినా పై పై పూతలు పూసి రంగులు వేసి చక్కదిద్దినట్టు చేశారని,కానీ,కురిసిన వర్షాలకు భవనం పెచ్చులు ఒకేసారి ఊడిపడ డంతో ప్రజలు, ఉద్యోగస్తులు బతుకు జీవుడా అంటూ బయటికి పరుగులు తీశారని తెలుస్తున్నది.
వర్షం పడితే రికార్డ్స్ రూమ్లలో పైనుంచి నీరు కారడంతో రికార్డులన్నీ తడిసి ముద్దయిపోతున్నాయి.గతంలో నల్లగొండలో పనిచేసిన జిల్లా కలెక్టర్ కొత్త భవనానికి ఏర్పాటుకు సిద్ధం చేశారు.
ఆ భవనం కోర్టు కేసులో ఉన్నందున రిజిస్ట్రేషన్ కార్యాలయం మార్చబడలేదు.కోర్టు తీర్పు వచ్చేంతవరకు పాత భవంతిలో అధికారులు విధులు నిర్వహిస్తున్నారు.
ఇకనైనా జిల్లా అధికారులు దీనిపై దృష్టి సాధించి నూతన భవనాల ఏర్పాట్లకు శ్రీకారం చుట్టాలని ఉద్యోగస్తులు,జిల్లా ప్రజలు కోరుతున్నారు.