నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని అద్దంకి-నార్కెట్ పల్లి- మేదరమెట్ల జాతీయ రహదారిపై ఉన్న వేములపల్లి, బుగ్గబావిగూడెం,కుక్కడం,మాడుగులపల్లి తదితర గ్రామ పంచాయతీలో డ్రైనేజీ వ్యవస్థ లేక ఇళ్ళల్లో వాడుకున్న మురుగు నీరు రోడ్డుపై ఏరులై పారుతూ జాతీయ రహదారి కాస్త డొంక దారిని తలపిస్తుందని,రోడ్డుపైకి నీరు రావడం వలన వాహనాలు స్లిప్ అవ్వడం,పాదచారులు జారి పడడం లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని,అంతేకాకుండా మురుగు నీరు దుర్వాసన వెదజల్లుతూ ముక్కు మూసుకుని ప్రయాణం చేయాల్సి వస్తుందని ప్రజలు, వాహనదారులు వాపోతున్నారు.ఈ రహదారిపై నిత్యం వందలాది వాహనాలు, అధికారులు,ప్రజా ప్రతినిధులు రాకపోకలు సాగిస్తున్నా ఎవరికీ పట్టక పోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం వర్షా కాలం సీజన్ ప్రారంభం కావడంతో ఈ సమస్య మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నదని,ఈ మురుగు నీరు వలన సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని,రోడ్డు వెంట చెట్లు ఏపుగా పెరిగి వచ్చిపోయే వాహనాలు కనిపించక ఇబ్బంది పడుతున్నారని, అయినా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.ఎన్నికల సమయంలో సమస్యలు పరిష్కరిస్తామని మాటలు చెప్పి ఓట్లేయించుకొని, గెలిచినాక ఇటు వైపు తొంగి చూడటం లేదని,తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థంకాని స్థితిలో ఉన్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు,ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి డ్రైనేజ్ నీరును రోడ్డుపైకి రాకుండా,రోడ్డు పక్కన పెరిగిన చెట్లను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.