జిల్లాలోని తండాల్లో తీజ్ సంబరాల కోలాహం...!

నల్లగొండ జిల్లా: అడవి బిడ్డలైన బంజారాల కట్టుబొట్టు, సంస్కృతీ,సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ ప్రతీ ఏటా శ్రావణ మాసంలో 9 రోజుల పాటు అత్యంత వైభవంగా అడవి దేవతలను కొలుస్తూ చిన్నా పెద్దా ఆడా మగ తేడా లేకుండా ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకునే తీజ్‌ పండుగ నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్,దేవరకొండ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున, మిగతా ప్రాంతాల్లో ప్రతీ తండాలో సాంప్రదాయ బద్ధంగా కొనసాగుతున్నాయి.గిరిజనులు(బంజారాలు) జరుపుకునే పండుగలకు ఓ ప్రత్యేకత ఉంటుంది.

 Teej Celebrations Are Uproar In Thandas Of The Nalgonda District, Teej Celebrati-TeluguStop.com

అందులో తీజ్‌కు ప్రత్యేక స్థానం ఉంది.బంజారుల సంస్కృతిని కాపాడుతూ ప్రకృతిని ఆరాధించే (బతుకమ్మ పండుగను పోలిన)మొలకల వేడుక ప్రారంభమైంది.

పండుగ ప్రారంభానికి ముందు పెళ్లికాని యువతులందరూ పెద్దల ఆశీర్వాదాలు తీసుకొని, ఇంటింటికీ తిరిగి విరాళాలు సేకరించి,అంగడికి వెళ్లి గోధుమలు,శనగలు తెచ్చి, గోధుమలు నానబెట్టి, మొలకెత్తించేందుకు ఒక్కో యువతి ఒక్కో బుట్టను తయారు చేసి,

ఆబుట్టలన్నీ ఒకే చోట ఉంచేందుకు పందిరి ఏర్పాటు చేసి,పుట్టమట్టి తెచ్చి అందులో పశువుల ఎరువును కలుపుతారు.బంజారుల ఆరాధ్యదైవమైన మేరామ అమ్మవారు,సేవాలాల్‌ మహారాజ్‌,సీత్లాభవాని పేర్లతో తయారు చేసిన బుట్టలలో మొదటగా తండాపెద్దల చేత ఎరువు కలిపిన మట్టిని బుట్టల్లో పోయిస్తారు.

నాన బెట్టిన గోధుమలను మట్టి కలిపిన బుట్లలో చల్లుతారు.రోజు మూడు పూటలా బుట్టల్లో నీళ్లుపోస్తారు.

దాని ద్వారా మొలిచిన గోధుమ మొలకలను తీజ్‌గా పిలుస్తారు.ఈ తొమ్మిది రోజుల పాటు యువతులు ప్రత్యేక ఉపవాసాలతో ఉప్పు,కారం లేని భోజనం చేస్తూ, మాంసాహారానికి దూరంగా ఉంటూ తండానుంచి బయటకు వెళ్లకుండా భక్తిశ్రద్ధలతో నియమాలు పాటిస్తారు.

తొమ్మిది రోజుల పాటు రోజుకో పూజా కార్యక్రమం నిర్వహిస్తారు.నానబెట్టిన శనగలను రేగిముళ్లను గుచ్చే ఒక విలక్షణమైన ఆచారాన్ని బోరడిఝుష్కేరో పేరుతో పిలుస్తారు.

గోధుమలను బుట్టలో చల్లడం సాయంత్రం నిర్వహిస్తారు.

పెండ్లికాని ఆడపిల్లలు రేగిముళ్లకు శనగలు గుచ్చుతుంటే బావ వరుసైనవారు ముళ్లను కదిలిస్తారు.

అయినా అమ్మాయిలు సహనంతో శనగలను ముళ్లకు గుచ్చాల్సి ఉంటుంది.తీజ్‌ ఎంత ఏపుగా,పచ్చగా పెరిగితే తమకు నచ్చిన జీవిత భాగస్వామి వస్తారని విశ్వసిస్తారు.

ఏడో రోజు రొట్టెలు,బెల్లం కలిపిన ముద్దను మేరామ అమ్మవారికి సమర్పిస్తారు.ఎనిమిదో రోజు బంజారుల ఆరాధ్యదేవతల ప్రతిరూపాలను మట్టితో చేసి పూజిస్తారు.

తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తూ చివరిరోజు నిమజ్జనం కనుల పండువగా నిర్వహిస్తారు.వివిధ ప్రాంతాల్లో ఉండే తమ బంధువులను ఆహ్వానిస్తారు.

మొలకల బుట్టలను ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యువతులు తీజ్‌ను తలపై పెట్టుకుంటారు.తీజ్‌ను పెద్దల తలపాగాలో ఉంచి ఆశీర్వాదాలు తీసుకుంటారు.

తీజ్‌ బుట్టలను తలపై ఉంచుకొని డప్పుచప్పుళ్లతో సంప్రదాయబద్ధంగా నృత్యాలు చేస్తూ ఆటాపాటలతో బయలుదేరి చెరువుల్లో నిమజ్జనం చేయడంతో తీజ్ ఉత్సవాలు ముగుస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube