నల్లగొండ జిల్లా:మును”గోడు”రోజుకో కొత్త వివాదానికి తెరతీస్తుంది.కాంగ్రేస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీకి,పదవికి రాజీనామా చేసిన బీజేపీలోకి చేరిన తర్వాత మునుగోడులో నిత్యం రాజకీయ ప్రకంపనలు వెలుగుచూస్తున్నాయి.
తాజాగా మునుగోడు మండలం ఊకొండి గ్రామంలో బుధవారం కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో స్థానిక కాంగ్రేస్ నేతలు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ భువనగిరి ఎంపీ,టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఘాటైన ఆరోపణలు చేశారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రేస్ పార్టీలో ఉంటూ పార్టీని మోసం చేసి బీజేపీలోకి వెళ్లిన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక కేడర్ కు ఫోన్ చేసి పదే పదే వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కోమటిరెడ్డి బ్రదర్స్ కి అన్ని రకాల అవకాశాలు కల్పించి రాజకీయ జన్మనిచ్చి,ఎన్నో పదవిలిచ్చిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రేస్ ను నేతలు మోసం చేస్తే కార్యకర్తలం కష్టపడి కాపాడుకుంటూ వస్తున్నామని,అలాంటి మమ్ములను బీజేపీకి సపోర్ట్ చేయమని అంటే జీర్ణించుకోలేక పోతున్నామని అన్నారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రేస్ లో ఉన్నట్లు నటిస్తూ పార్టీకి చెందిన కార్యకర్తలను వేధించడం తగదని అన్నారు.
వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటావో,బీజేపీలోకి వెళతావో తేల్చుకో అంటూ స్థానిక కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు అల్టిమేటం జారీ చేశారు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి.