నల్లగొండ జిల్లా: నేటి ప్రశాంత సమాజం పోలీసు అమరవీరుల ప్రాణాల త్యాగ ఫలితమేనని, శాంతిభద్రతలు కాపాడుటలో పోలీసు 24 గంటలు నిర్విరామంగా పనిచేస్తూ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే అక్టోబర్ 21 పురస్కరించుకుని శనివారం సూర్యాపేట జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పోలీసు అమరవీరుల స్తూపం వద్ద పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే,అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొని పోలీసు సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించి,పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులు ఘటించారు.
పోలీస్ పరేడ్ కమాండర్ గా ఆర్ఎస్ఐ రాజశేఖర్ వ్యవహరించారు.
సంవత్సర కాలంలో దేశంలో అమరులైన 189 మంది పోలీసు సిబ్బంది, జవానుల పేర్లను సూర్యాపేట డిఎస్పి నాగభూషణం గుర్తు చేశారు.పోలీసు కళాబృందం సభ్యులు అమరవీరుల త్యాగాలను విస్మరిస్తూ సాంస్కృతిక గేయాలు ఆలపించారు.
అనంతరం అమరవీరుల స్తూపం వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించి,పోలీసు అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు పెట్టి నివాళులు ఘటించారు.
అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నక్సలైట్ల ప్రభావం తగ్గించడంలో పోలీసుల వీరోచిత కృషి, పోలీసుల ప్రాణత్యాగ ఫలితమేనని తెలిపారు.
శాంతి భద్రతలను కాపాడటం కోసం పోలీసు సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తూ వారి జీవితాలను సైతం లెక్కచేయడం లేదని, ప్రజలకు భద్రత భావం కల్పిస్తున్నారన్నారు.రాత్రి, పగలు,ఎండ,వాన లాంటి వాతావరణ పరిస్థితులను లెక్క చేయక ముందుకు సాగుతున్నారని కొనియాడారు.
పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని వారి సంక్షేమాలకు కృషి చేస్తామన్నారు.అమరుల కుటుంబ సభ్యులకు అమరుల త్యాగాల గుర్తుగా జ్ఞాపకాలను బహూకరించారు.
పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 31వ తేదీ వరకు పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాలు నిర్వహిస్తామని ఫ్లాగ్ డే కార్యక్రమాల్లో ప్రజలు, పౌరులు,అధికారులు,ప్రజా ప్రతినిధులు,విద్యార్థులు అందరూ భాగస్వామ్యమై అమరవీరులకు నివాళులు ఘటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీలు నాగభూషణం, ప్రకాష్ జాదవ్, అమరవీరుల కుటుంబ సభ్యులు,పోలీస్ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ రామచందర్,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజేష్, ఎలక్షన్ సెల్ ఇన్స్పెక్టర్ మహేష్,సీఐలు రాజశేఖర్, అశోక్ రెడ్డి,శివ శంకర్, ఆర్ఐ నారాయణరాజు, ఎస్ఐలు,ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.