నల్లగొండ జిల్లా:వైవాహిక జీవితంలో విసిగిపోయి తాను పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడుతున్నానని తనను ఎవరూ వెతకొద్దని కాల్ చేసిన మహిళను ఫిర్యాదు చేసిన అర్ధగంటలోనే నల్లగొండ జిల్లా కనగల్ పోలీసులు ట్రేసింగ్ చేసి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘటనపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది.కనగల్ ఎస్ఐ పి.
విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం… నల్గొండ రూరల్ మండలం జి.చెన్నారం గ్రామానికి చెందిన కాలం నాగరాజు భార్య నాగజ్యోతి వైవాహిక జీవితంలో నిత్యం గొడవల జరిగేవి.ఆ కారణంగా జీవితంపై విరక్తి చెందిన నాగజ్యోతి మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఎవరికి చెప్పకుండా తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని భర్త ఇంటి నుండి వెళ్ళిపోయింది.
దీంతో భర్త,జ్యోతి తల్లిదండ్రులు చుట్టుపక్కల, చుట్టాల,తెలిసిన వాళ్ళ ఊర్లలో వెతికినా ఆచూకీ లభించలేదు.
దీనితో బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో కనగల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు.వెంటనే స్పందించిన కనగల్ ఎస్ఐ పి.విష్ణుమూర్తి పోలీసులను రెండు టీములుగా విభజించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో జ్యోతి అన్న మొబైల్ కు ఒక కొత్త నెంబర్ నుండి తన చెల్లె నాగజ్యోతి ఫోన్ చేసి అన్నా నేను చనిపోతున్నాను.నా గురించి ఎవరు వెతకొద్దు.
నేను పిల్లల్ని తీసుకొని చనిపోతున్నానని చెప్పి ఫోన్ కట్ చేసింది.ఇదే విషయం అమ్మాయి అన్న కనగల్ పోలీసులకు చెప్పడంతో ఆ నెంబర్ ను నెట్వర్క్ ద్వారా ట్రేస్ చేసి అమ్మాయి హైదరాబాదులో ఉందని నిర్ధారించుకొని,స్థానిక హైదరాబాదులోని హయత్ నగర్ లో పోలీసుల సహకారంతో నాగజ్యోతి ఆచూకీని కేవలం అర్ధగంటలో కనుగొని క్షేమంగా వారి యొక్క బంధువులకు హయత్ నగర్ పోలీసులు అప్పజెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
కనగల్ ఎస్ఐ విష్ణుమూర్తి, పోలీసుల కృషిని నాగజ్యోతి కుటుంబ సభ్యులు, బంధువులు,ప్రజలు అభినందిస్తున్నారు.







