నల్లగొండ జిల్లా: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటి అమలుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
అలాగే ఆయా పథకాలు పొందాలంటే రేషన్‌కార్డులు కీలకం కానున్నాయి.ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రేషన్ కార్డు అనేది అత్యంత ప్రాధాన్యం.
దీంతో తమకు ఎలా పథకాలు వర్తిపాజేస్తరని ఇప్పటి వరకు కార్డు పొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొత్త ప్రభుత్వం రేషన్‌కార్డులు జారీచేసే ప్రక్రియపై ఫోకస్ చేయాలని,కార్డులు లేక ఎన్నో ఏళ్లుగా సంక్షేమ పథకాలకు దూరమయ్యామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పడు ఏర్పడిన కొత్త ప్రభుత్వమైనా తమకు రేషన్‌కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రభుత్వం ప్రజాపాలన అప్లికేషన్ తీసుకుంది.
వీటితోపాటు ప్రజల వద్ద నుంచి కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ కూడా తీసుకున్నారు.అయితే 6 గారెంటీల కంటే రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారి సంఖ్య అధికంగా ఉండడం గమనార్హం.
ప్రజాపాలన లలో వచ్చిన దరఖాస్తులు ఆన్లైన్ డేటా ఎంట్రీ లో 5 గ్యారెంటిలకు సంబంధించిన డేటా మాత్రమే అనుమతించారు.కానీ, కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి డేటాను ఎంట్రీ చేయడం లేదు.
దీంతో కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి కార్డులు ఏ డేటా ఆధారంగా ఇస్తారన్న ప్రశ్న మొదలైంది.లబ్ధిదారులు ఈసారైనా మాకు కొత్త రేషన్ కార్డు అందుతుందో లేదో అన్న ఆందోళనలో ఉన్నారు.
గత ప్రభుత్వ హయాంలో కొత్తగా కార్డులు పొందేందుకు కొందరు, ఉన్న కార్డులో మార్పులు చేర్పులకు మరికొందరు దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడుస్తున్నాయి.అయినా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు.
రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు మోక్షం కలగలేదు.ఈ క్రమంలో లాక్‌డౌన్‌లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు రేషన్‌కార్డు ఉన్న లబ్ధిదారులకు ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకులు, రూ.2 వేల నగదు అందించారు.రేషన్ కార్డు లేకపోవడంతో ఎంతో మందికి ప్రభుత్వ సాయం అందకుండా పోయింది.
ఈ క్రమంలో లాక్‌డౌన్ ముగిసిన తర్వాత 2021 జూలైలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రేషన్‌కార్డులు మంజూరు చేసినట్టే చేసి ఆ ప్రక్రియను ఏ కారణం లేకుండానే నిలిపివేసింది.దీంతో చాలామందికి కొత్తకార్డులు అందలేదు.
కొన్నిటికి మాత్రమే మోక్షం కలగగా అధిక సంఖ్యలో దరఖాస్తులు పేరుకుపోయాయి.పెండింగ్ దరఖాస్తుల సంఖ్య ఎంత అనేది అధికారులే చెప్పలేకపోతున్నారు.
ప్రస్తుతం ఉన్న కార్డుల్లో మార్పులు,చేర్పుల కోసం ఈ-పాస్ సైట్‌ను వినియోగించేందుకు ప్రభుత్వం లబ్ధిదారులకు అవకాశం కల్పించింది.ఈ సవరణల దరఖాస్తులను తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లా పౌరసరఫరాల అధికారులకు పంపాల్సి ఉంటుంది.
కానీ, రెండున్నరేళ్లుగా లాగిన్ ఓపెన్ కాకపోవడంతో నూతన కార్డులు మంజూరు కావడం లేదు.ఉమ్మడి కుటుంబాల వివరాలు మార్పులు చేయాల్సి వస్తే ముందుగా కార్డులో నుంచి పేరు తీసివేయాల్సి ఉంటుంది.
చాలా మంది ఇప్పటి వరకు ఉమ్మడి కార్డుల నుంచి పేరు తొలగించుకొని నూతన కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.కార్డులు మంజూరు కాకపోవడంతో వారికి నిరాశే ఎదురైంది.
ఉన్న కార్డుల్లో పేరు లేకపోవడం,కొత్త కార్డు మంజూరు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కొత్త రేషన్ కార్డుల మంజూరులో గత ప్రభుత్వం వ్యవహరించిన విధానంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి.
కనీసం ఎన్నికల ముందైనా రేషన్‌కార్డులు ఇస్తారని ఆశపడ్డ వారికి నిరాశే ఎదురైంది.ఎన్నికలకు ముందు తెరపైకి తెచ్చిన బీసీలకు రూ.లక్ష ఆర్థికసాయం,డబుల్ బెడ్‌రూం,కళ్యాణలక్ష్మి తదితర పథకాలకు రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకోవడంతో కొత్తగా పెళ్లై రేషన్‌కార్డు రాని వారు అనర్హులు కావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.దీంతో పాటు రేషన్‌కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం లేకపోవడంతో కూడా తీవ్రంగా అవస్థ పడుతున్నారు.
ప్రజలకు సంక్షేమ పథకాలు అందడంలో రేషన్ కార్డులనే ప్రభుత్వాలు ప్రమాణికంగా తీసుకుంటున్నాయి.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు కూడా ఈ కార్డులే కీలకం కానున్నాయి.
దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యానికి రేషన్ కార్డుదారులు తప్పనిసరి.ఈ క్రమంలో రేషన్ కార్డులను వీలైనంత త్వరగా మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.