సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ దేవుడికి సమర్పించడం ఆచారంగా వస్తోంది.కానీ కొబ్బరికాయ దేవుడికి కాకుండా మనిషి తల పై కొట్టడం ఎప్పుడైనా చూశారా?ఈ విధంగా మనిషి తలపై కొబ్బరికాయ కొట్టడం అంటే మనకు అరుంధతి సినిమానే గుర్తొస్తుంది.ఆ సినిమాలో తలపై కొబ్బరికాయలు కొట్టే దృశ్యం చూస్తే చలించిపోతారు.కానీ నిజ జీవితంలో కూడా ఈ విధంగా మనిషి తలపై కొబ్బరికాయ కొట్టే ఆచారం ఇప్పటికీ తమిళనాడు రాష్ట్రంలోని, కరూర్ జిల్లాలో, మెట్టు మహాదానపురములో ఉన్న మహాలక్ష్మి ఆలయంలో ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు.
అయితే ఈ విధంగా మనిషి తల పై కొబ్బరికాయ కొట్టే ఆచారాన్ని పాటించడానికి గల కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….
మన భారతదేశంలో పండుగలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
పండుగ రోజులలో భక్తులు తమదైన రీతిలో స్వామివారికి మొక్కులు తీర్చుకోవడం మనం చూస్తూనే ఉంటాం.ఈ క్రమంలోనే అగ్నిగుండం పై నడవడం, త్రిశూలం నాలుకకు పెట్టుకొని మొక్కులు చెల్లించడం వంటివి తరచూ మనం చూస్తూనే ఉన్నాం.
కానీ తమిళనాడులో ఈ ప్రాంతంలో మాత్రం అమ్మవారికి ఎంతో భిన్నంగా తలపై కొబ్బరికాయలను కొడుతూ మొక్కులు చెల్లిస్తుంటారు.ఈ విధంగా తలపై కొబ్బరికాయలు కొట్టడం వెనుక ఒక కారణం ఉంది.

పురాణాల ప్రకారం ఇక్కడ భక్తులు శివుడు అనుగ్రహం కోసం ప్రార్థించినప్పుడు శివుడు ప్రసన్నం కావడానికి నిరాకరిస్తారు.దీంతో అక్కడ ఉన్నటువంటి భక్తులు ఆ పరమశివుడికి మూడు కన్నులు ఉన్న విధంగా కొబ్బరికాయకు కూడా మూడు కన్నులు ఉంటాయని భావించి ఆ పరమశివుని ప్రసన్నం చేసుకోవడానికి తలపై కొబ్బరికాయలను పగలుగోట్టుకోవడం ప్రారంభించారు.చివరకు ఆ పరమశివుడు ప్రత్యక్షమై తమ కోరికలు నెరవేర్చినట్లు చెబుతారు.అప్పటి నుంచి భక్తులు ఈ ఆలయంలో తలపై కొబ్బరికాయలను కొట్టుకోవడం ఆచారంగా పాటిస్తున్నారు.ఈ విధంగా తలపై కొబ్బరికాయలు కొట్టుకోవడం ద్వారా వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.అయితే ఇక్కడ కొబ్బరికాయలు తలపై కొట్టించుకున్న వారు వారికి ఏమీ జరగలేదు అన్న భావనతో బయటకు వెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఇప్పటికి ఈ అమ్మవారి ఆలయంలో ఈ ఆచారాన్ని పాటించడం ఎంతో విశేషం.