నల్లగొండ జిల్లా: తిరుమలగిరి(సాగర్) మండలంలోని భూ సమస్యలను నూటికి నూరు శాతం పరిష్కరించి రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలిపేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం జరిగిందని రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ కార్యదర్శి,మరియు భూ పరిపాలన చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్( Navin Mittal ) అన్నారు.బుధవారం అయన తిరుమలగిరి సాగర్ మండలం చింతలపాలెం గ్రామంలో భూసమస్యల పరిష్కారం నిమిత్తం రైతులతో ఏర్పాటు చేసిన గ్రామసభకు ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ…భూములకు సంబంధించిన సమస్యలన్నిటికీ పరిష్కారం తీసుకువచ్చేందుకు గాను ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు.
ఇందులో భాగంగా ప్రస్తుతమున్న భూ యాజమాన్య హక్కు చట్టం (ఆర్ఓఆర్)లో కొన్ని సాదాబైనామా,విరాసత్ వంటి సమస్యలు తీర్చడానికి నిబంధనలు లేనందున ఈ సమస్యల పరిష్కారం నిమిత్తమై కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించినట్లు తెలిపారు.ఈ క్రమంలో రెవెన్యూ చట్టంలో పారదర్శకత తీసుకువచ్చేందుకుగాను కొత్త చట్టం తేవాలన్న ఉద్దేశ్యంతో ముసాయిదా చట్టాన్ని రూపొందించడం జరిగిందన్నారు.
తిరుమలగిరి (సాగర్) ( Thirumalagiri (Sagar) Mandal )మండలాన్ని భూ సమస్యల పరిష్కారంలో పైలెట్ మండలం గా తీసుకునే విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో చర్చించిన అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర శాసనసభలో ప్రకటన చేయడం జరిగిందని,ప్రస్తుతం ఉన్న చట్టంలో కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం లేదని,వీటిని దృష్టిలో ఉంచుకుని నూతన చట్టం తీసుకురావాలని ప్రతిపాదించి,దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, ప్రజల్లోకి తీసుకువెళ్లి సూచనలు,సలహాలతో తీసుకోవడంజరుగుతుందన్నారు.
రానున్న నూతన చట్టం తప్పనిసరిగా దీర్ఘకాలం రైతులకు ఉపయోగపడుతుందన్న నమ్మకాన్ని వెలిబుచ్చారు.
ఈ మండలంలోని భూ సమస్యలను అన్నిటిపై అధ్యయనం చేసి ఒక్కో సమస్యను పరిష్కరిస్తామని,ముఖ్యంగా ఫారెస్ట్, రెవెన్యూ సంబంధించిన సమస్యలు,అలాగే ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు.తిరుమలగిరి (సాగర్) లోని సమస్యలు అన్నింటిని నూటికి నూరు శాతం పరిష్కరించేందుకు కృషి చేసి,ఈ మండలాన్ని రాష్ట్రానికి మార్గదర్శకం చేసేలా చేస్తామన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ…ధరణి, భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించి రైతులకు భూ సమస్యలు లేకుండా చేయాలన్న ఉద్దేశ్యంతో ఈమండలాన్ని పైలెట్ ప్రాజెక్టు మండలంగా ఎంపిక చేసినట్లు తెలిపారు.భూ సమస్యల పరిష్కారం నిమిత్తం పైలెట్ మండలానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించి,ఐదు మండల బృందాలను,10 మంది సర్వేయర్లను నియమించామని,గత సోమవారం నుండి సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు.గ్రామస్థాయిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ప్రత్యక్షంగా తెలుసుకునే నిమిత్తం రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ చింతలపాలెం గ్రామానికి వచ్చినట్లు వెల్లడించారు.
మండలంలో మొత్తం 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని,కృష్ణానది తీర ప్రాంతంలో అటవీ, ప్రభుత్వ,పట్టా భూములు ఉన్నాయని,అయితే ఈ భూములలో కొంతమందికి పట్టాలు లేకపోవడం, కొంతమందికి పట్టాలున్నా భూమి లేకపోవడం వంటి సమస్యలతో ఉన్నారని తెలిపారు.మొత్తం మండలంలో 11,246 ఎకరాల విస్తీర్ణంలో భూములు ఉన్నాయని, ఇందులో 1260 ఎకరాలు అటవీ భూములు ఉన్నాయని,3,931 ఎకరాలు మాత్రం ధరణిలో వచ్చిందని,ఇంకా సుమారు 7 వేల ఎకరాలు ధరణిలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
వివిధ భూ సమస్యలన్నీ మండలంలోని 7 గ్రామాలలో ఎక్కువగా ఉన్న దృష్ట్యా దీని ఆధారంగా ఈ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు చెప్పారు.
వీటితో పాటు,ఆర్ఓఆర్ లో సైతం సమస్యలు ఉన్నాయని, తిరుమలగిరి (సాగర్) మండలం మారుమూల మండలం కావడం,గిరిజన ప్రజలు ఎక్కువగా ఉండటం వల్ల అవగాహన లేని కారణంగా గతంలో ఆర్ఓఆర్ రికార్డులు అప్డేట్ కాలేదని,పట్టాలు ఇచ్చిన వారికి కూడా రికార్డులో రాకపోవడం జరిగిందన్నారు.
మండలంలో ఉన్న రెవెన్యూ,ఫారెస్ట్, వదిలివేసిన భూములు, పట్టా భూముల్లోని సమస్యలను కలెక్టర్ కూలంకషంగా వివరించారు.ప్రత్యేకించి చింతలపాలెం గ్రామంలో సుమారు 6000 ఎకరాలకు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని,అలాగే పట్టాలు ఇచ్చిన 3900 ఎకరాలలో బోగస్ పట్టాలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.
సీసీఎల్ కార్యాలయాధికారి లచ్చి రెడ్డి మాట్లాడుతూ… గ్రామంలో సమస్యలు తెలుసుకునేందుకు రెవెన్యూ తరఫున తప్పనిసరిగా ఒక ఉద్యోగిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.భూసమస్యలకు ఏదో రకంగా పరిష్కారం తెలుసుకునేందుకు కృషి చేస్తున్నామని,అందులో భాగంగానే చింతలపాలెం గ్రామానికి వచ్చినట్లు తెలిపారు.
ధరణి కమిటీ సభ్యులు,ప్రముఖ న్యాయవాది భూమి సునీల్ మాట్లాడుతూ… భూములకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టంలో కొన్ని సమస్యల పరిష్కారానికి మార్గం లేనందున కొత్త చట్టం తీసుకువచ్చే ఆలోచనలో ప్రభుత్వం కృషి చేస్తున్నదని,భూమి ఉండి కాగితాల్లో లేనివారు, కాగితాలు ఉండి భూమి లేనివారు ఉన్నారని,ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి ఉన్న ప్రతి ఒక్కరికి హక్కు ఉండాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని, ఇందులో భాగంగానే పాత చట్టంలో సమస్యల పరిష్కారానికి అవకాశం లేదని గుర్తించి నూతన చట్టంలో వాటిని పొందుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా పలువురు రైతులు,మాజీ ఎంపిటిసి కాశయ్య మాట్లాడుతూ.
భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయి అధికారుల బృందం తమ గ్రామానికి రావడం సంతోషంగా ఉందని, తాము ఎన్నో ఏళ్ల నుండి పోరంబోకు భూములు సాగు చేసుకుంటున్నా తమకు ఎలాంటి పట్టాలు లేవని,రెండేళ్ల కింద సర్వే నిర్వహించినప్పటికీ పట్టాలు రాలేదన్నారు.
భూమి ఖాళీ లేదని రెవెన్యూ అధికారులు చెప్తున్నారని,అందరూ ఎస్సీ,ఎస్టీ,బీసీ వారే ఉన్నందున తమ సమస్యను పరిష్కరించి పట్టాలివ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్,డీఎఫ్ఓ రాజశేఖర్,భూ సమస్యల పరిష్కారానికి నియమించబడిన డిప్యూటీ కలెక్టర్ సుబ్రమణ్యం,ఆర్డీవో శ్రీనివాసరావు,సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్,హరి, శ్రీనివాస శర్మ,దశరథ్ నాయక్,తిరుమలగిరి డిటి ఖాదర్,జంగాల కృష్ణయ్య, జవహర్ లాల్,ఆయా మండలాల బృందాల సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.