నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్ర ప్రభుత్వ దావఖానాలో ప్రత్యేకంగా గైనకాలజీ వార్డులో గర్భిణులపై, వారి బంధువులపై వైద్యులు,సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరు అమానవీయంగా ఉందని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు,కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.కట్టంగూరు మండలానికి చెందిన గర్భిణి అఖిల ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందిన తీరుపై ఆదివారం ప్రజా సంఘాల బృందం ఆధ్వర్యంలో గైనకాలజీ వార్డును సందర్శించి వైద్య నిమిత్తం వచ్చిన గర్భిణులను,వారి బంధువులను అఖిల మృతిపై వివరాలు సేకరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాన్పుకోసం వచ్చిన వారిని వైద్య సిబ్బంది పనిమనుషుల కంటే హీనంగా,దారుణంగా చూస్తున్నారని మహిళలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గర్భిణీలతో ఎట్టిపరిస్థితుల్లోనూ తొడపాశం పెట్టైనా మీకు నొప్పులు తెప్పిస్తామని, డాక్టర్లు మీరా,మీమా అంటూ దుర్భాషలాడుతూ, పనికిమాలిన దానా ఇక్కడి నుంచి భయటికి ఎల్లురి అని నానా బూతులు తిడుతున్నారని బాలింతలు వాపోయినట్లు తెలిపారు.
అఖిల మృతి చెందిన విషయంపై జిల్లా కలెక్టర్ ను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలుస్తామని ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు మానుపాటి భిక్షమయ్య,నలపరాజు సైదులు తదితరులు పాల్గొన్నారు.