నల్గొండ జిల్లా:చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో గల పెద్ద చెరువులో చేపల పట్టడానికి వెళ్ళిన మత్స్యకారులకు షాక్ తగిలినంత పనైంది.పెట్టుబడి పెట్టీ చెరువులో చేప పిల్లలు పోసి పట్టడానికి వెళ్ళి వల వేయడంతో వింత ఆకారంలో రాకాసి చేపలు కుప్పలు కుప్పలుగా రావడంతో వాటిని చూసిన మత్స్యకారులు ఒక్కసారిగా అవాక్కైన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.
గత వర్షాకాలంలో మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన చేప పిల్లలను అందించి చెరువులో వేయడం జరిగింది.
అయితే ఈ చేపలు పెరగకుండా అలాగే ఉండిపోయాయి.
పిల్లాయిపల్లి కాలువ నీటి ద్వారా ఈ రాకాసి చేపలు చెరువులోకి వచ్చి చెరువులోని ఇతర చేపలను బ్రతకనివ్వండి చేశాయని మత్స్యకారులు లబోదిబోమంటున్నారు.ప్రభుత్వం మాకు ప్రతి సంవత్సరం ఉచిత చేప పిల్లల పంపిణీ చేస్తున్నప్పటికీ గత సంవత్సరం నుంచి మా చెరువులో ఈ కొత్త రకం చేపలు వచ్చి ప్రభుత్వం ఇచ్చిన చేప పిల్లలను తినేస్తున్నాయని,ఈ రాకాసి చేపల వలన చెరువులో చేప పిల్లల ఎదుగుదల లేక నష్టపోయామని మత్స్యకారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంగట్లో అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లు ఈ రాకాసి చేపలు ఎలా వచ్చాయో మాకు అంతుపట్టడం లేదని వాపోతున్నారు.పిల్లాయిపల్లి కాలువ ద్వారా నీరు రావడంతో చెరువు నిండి అలుగు పోయడం వల్ల సంబరపడిపోయి మా జీవితాలు ఇకనైనా బాగుపడతాయని ఆశించామని,కానీ,ఈ రాకాసి చేపల వల్ల ఇప్పటికే మాకు రెండు లక్షల రూపాయల నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.