నల్లగొండ జిల్లా:ప్రజలకు ప్రభుత్వఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే కొంతమంది ప్రభుత్వ డాక్టర్ల పని తీరుతో ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం లేకుండా పోతుందని నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్యాధికారి తన రూటే సపరేటు అన్నట్లుగా ఉన్నారని, సమయపాలన పాటించకుండా,రోగులను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అతనికి ఇష్టం ఉన్నప్పుడే డ్యూటీకి వస్తారు లేకుంటే ఇక్కడ నర్సులే పెద్ద దిక్కుగా మారుతున్నారని,మండల కేంద్రం కావడంతో ప్రతిరోజూ వివిధ గ్రామాల నుండి పేద ప్రజలు వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు.కానీ,డాక్టర్ అందుబాటులో లేక నర్సులే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం కొండంత భరోసా ఇస్తుంటే ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం అందించే డాక్టర్ ఈ విధంగా డ్యూటీకి డుమ్మా కొడుతూ పేదలకు ఆరోగ్యాన్ని అందని ద్రాక్షలా మారుస్తున్నారని ఆరోపిస్తున్నారు.ఆరోగ్య కేంద్రం డాక్టర్ రాక,కనీస సదుపాయాలు లేక రోగులు రావడానికి భయపడుతున్నారని,డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో నర్సులే వైద్యం చేస్తూ ఒక్కపూట బడి లాగా ఒక్కపూట హాస్పిటల్ నడుపుతూ ఎవరికీ నచ్చినప్పుడు వాళ్ళు వెళ్లిపోవడంతో వివిధ సమస్యలతో వచ్చే రోగులు వెనుదిరిగి పోతున్నారని, ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇక్కడ డాక్టర్ సమయపాలన పాటించేలా,రెండు పూటలా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా,పూర్తి ల్యాబ్ సౌకర్యంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేసి, ప్రజలకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.