నల్లగొండ జిల్లా: నేటితో తెలంగాణ అసెంబ్లీ సాధారణ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియనుండడంతో ముందే నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీల మరియు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ల జోరు కొనసాగింది.ఆయా నియోజకవర్గ కేంద్రాలు పార్టీల బల ప్రదర్శనలు, ర్యాలీలతో హోరెత్తిపోగా, కొందరు బీఆర్ఎస్ అభ్యర్దులు సీఎం కేసీఆర్ సభలు ఉన్నచోట సాదాసీదాగా నామినేషన్ వేశారు.
ప్రధాన పార్టీల నామినేషన్లు ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.ప్రధాన పార్టీల అభ్యర్దులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీ మొత్తంలో నామినేషన్ దాఖలు చేయగా,కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిలో టిక్కెట్ ఖరారు కాకుండానే కొందరు నామినేషన్ పత్రాలను సమర్పించారు.
గురువారం రాత్రి ఏఐసీసీ చివరి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.అందులో నామినేషన్ వేసిన బత్తుల లక్ష్మారెడ్డి (మిర్యాలగూడ),రామిరెడ్డి దామోదర్ రెడ్డి (సూర్యాపేట)టిక్కెట్ ఖరారు కాగా,తుంగతుర్తి నుండి నామినేషన్లు వేసిన వారికి నిరాశే మిగిలింది.
ఇక్కడి నుండి మాజీ గిడ్డంగుల చైర్మన్ మందుల సామ్యేల్ కు టిక్కెట్ దక్కింది.నేటితో నామినేషన్ల ఘట్టం ముగియనుండడంతో మిగిలిన పార్టీల,స్వతంత్ర అభ్యర్థులు కూడా నేడు నామినేషన్లు వేసే అవకాశం ఉంది.
గురువారం నల్లగొండ జిల్లా నుండి నల్లగొండ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్),కంచర్ల భూపాల్ రెడ్డి(బీఆర్ఎస్), నాగార్జునసాగర్-కుందూరు జైవీర్ రెడ్డి(కాంగ్రెస్),నోముల భగత్ (బీఆర్ఎస్),
కంకణాల నివేదిత రెడ్డి(బీజేపీ), కుందూరు జానారెడ్డి (కాంగ్రెస్ బీఫామ్ లేదు),మామిడి సైదయ్య (ధర్మ సమాజ్ పార్టీ), దేవరకొండ- రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ (బీఆర్ఎస్),కేతావత్ లాల్ నాయక్ (బీజేపీ), గుగులోత్ రవి నాయక్ (ధర్మ సమాజ్ పార్టీ), మిర్యాలగూడ- నల్లమోతు భాస్కరరావు (బీఆర్ఎస్), జూలకంటి రంగారెడ్డి (సీపీఎం),డబ్బికార్ మల్లోజీ @మల్లేశం (సీపీఎం),బత్తుల లక్ష్మారెడ్డి (కాంగ్రెస్ బీఫామ్ లేదు), బత్తుల మాధవి(కాంగ్రెస్ బీఫామ్ లేదు), మునుగోడు-కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి (కాంగ్రెస్),కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (బీఆర్ఎస్), చలమల్ల కృష్ణారెడ్డి (బీజేపీ), దోనూరి నర్సిరెడ్డి (సిపిఎం),నకిరేకల్ – వేముల వీరేశం(కాంగ్రెస్), చిరుమర్తి లింగయ్య (బీఆర్ఎస్) నామినేషన్ వేశారు.సూర్యాపేట జిల్లా నుండి సూర్యాపేట – గుంటకండ్ల జగదీష్ రెడ్డి (బీఆర్ఎస్),రామిరెడ్డి దామోదర్ రెడ్డి (కాంగ్రెస్ బీఫామ్ లేదు), పటేల్ రమేష్ రెడ్డి(కాంగ్రెస్ బీఫామ్ లేదు),
తుంగతుర్తి – గాదరి కిషోర్ కుమార్ (బీఆర్ఎస్),మోత్కుపల్లి నర్సింహులు (కాంగ్రెస్ బీఫామ్ లేదు),డాక్టర్ వడ్డేపల్లి రవి (కాంగ్రెస్ బీఫామ్ లేదు),బాషపంగు భాస్కర్ (కాంగ్రెస్ బీఫామ్ లేదు),కోదాడ – నలమాద పద్మావతి రెడ్డి (కాంగ్రెస్), మేకల సతీష్ రెడ్డి (జనసేన&బీజేపీ), మట్టిపెళ్ళి సైదులు (సీపీఎం),ఏపూరి సోమయ్య(ఎంసీపీఐయు), హుజూర్ నగర్ – నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్), శానంపూడి సైదిరెడ్డి (బీఆర్ఎస్),చల్లా శ్రీలతారెడ్డి (బీజేపీ), రాపోలు నవీన్ కుమార్ (బీఎస్పీ) నామినేషన్ పత్రాలను సమర్పించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా నుండి భువనగిరి – కుంభం అనిల్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్),పైళ్ళ శేఖర్ రెడ్డి (బీఆర్ఎస్),ఆలేరు – బీర్ల ఐలయ్య (కాంగ్రెస్) నామినేషన్ వేశారు.మిగతా వారంతా నేడు చివరి రోజు మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.