నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తేవడమే ప్రభుత్వ లక్ష్యమని,పార్టీలకు అతీతంగా ప్రజా పాలన జరుగుతుందని నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి( Kunduru Jaiveer Reddy ) అన్నారు.శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని పెద్దవూర మండల కేంద్రం, అనుముల మండలం పులి మామిడి గ్రామ పంచాయితీలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమాల్లో ఎమ్మేల్యే పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ప్రవేశపెట్టిన పథకాలు అందరికీ అందేలా చూడాలని,కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన రైతు భరోసా, మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి ప్రతి హామీలను నెరవేరుస్తామని, స్వీకరించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ అప్లోడ్ చేయాలని సూచించారు.అర్హులైన ప్రతీ ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా చూడాలని,అందరికీ పాలనను చేరువ చేసేందుకే ప్రజా పాలన( Praja Palana ) అని అన్నారు.
అలాగే ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తుందని,అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించిందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమాల్లో మండల అధికారులు,ప్రజా ప్రతినిధులు,ప్రజలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.