నల్లగొండ జిల్లా: గ్రామ పంచాయితీ ట్రాక్టర్ తో సర్పంచే అక్రమ ఇసుక దందాకు తెరలేపిన వైనం నల్లగొండ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.వివరాల్లోకి వెళితే శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామ సర్పంచ్ వేముల లింగయ్య ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్ ను గ్రామాభివృద్ధికి వినియోగించకుండా ఏకంగా అక్రమ ఇసుక రవాణా వాడుతూ ఎవరైనా ప్రశ్నిస్తే నా గ్రామానికి నేనే రాజు నేనే మంత్రి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
చనిపోయిన వ్యక్తి పేరు మీద బ్యాంక్ లోన్ తీసుకున్న ఘనుడే ఈ గ్రామ సర్పంచ్ కావడం గమనార్హం.అధికార పార్టీ ఎమ్మెల్యే అండతోనే ఇదంతా చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ ట్రాక్టర్ ఇసుక రవాణా చేయడం,అది కూడా ఓ మైనర్ (బాలుడు)డ్రైవర్ గా ఉండడంతో గ్రామానికి చెందిన వేముల శ్రీనివాస్ వాట్సాప్ ద్వారా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి,అక్రమ ఇసుక దందాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఈ విషయం కాస్త రచ్చకెక్కింది.ప్రభుత్వ ట్రాక్టర్ ను పంచాయితీ పనులకు కాకుండా సొంత పనులకు వాడుకుంటున్న గ్రామ సర్పంచ్ వేముల లింగయ్యపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్ధులు కోరుతున్నారు.