నల్లగొండ జిల్లా: మాడుగులపల్లి మండలం గోపాలపురం గ్రామంలో గత పదేళ్లుగా ప్రజలకు సరిపడా నీటిని అందిస్తున్న పంచాయితీ బోరుకున్న మోటార్ ను గ్రామ సర్పంచ్ తొలగించి,గ్రామ వైకుంఠధామం బోరుకి బిగించి,అక్కడి నుండి తన పొలానికి మళ్ళించుకోవడంతో గ్రామంలో నీటి కొరత ఏర్పడిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.మరో కొత్త మోటర్ తెచ్చి బోరుకు అమర్చి నీటి సమస్య తీర్చాలని ఎన్నిసార్లు విన్నవించినా సర్పంచ్ పట్టించుకోవడం లేదని, ప్రజలకు సరిపడా నీరందించే బోరు మోటారు తొలగించి,వైకుంఠధామంలో పెట్టడం,ఆ నీటిని తన సొంత పొలానికి మళ్లించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా మండల అధికారులు స్పందించి ప్రజలకు నీరందించే బోరుకి కొత్త మోటర్ బిగించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
గ్రామానికి చెందిన సింగం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పదేళ్ల నుండి గ్రామంలో నీటి కొరత లేకుండా చేసిన బోరు మోటారును తొలగించాల్సిన అవసరం ఏముందని,ఆ బోరు ద్వారా సరిపడా నీళ్ళు అందేవని,వైకుంఠధామంలోని బోరు ద్వారా ప్రజలకు ఎలాంటి లాభం లేదఎన్నారు.
సర్పంచ్ ఇష్టం వచ్చినట్లు చేస్తూ వైకుంఠధామంలో బోరుకి మోటర్ ను బిగించి తన వ్యవసాయ భూమి సాగు చేసుకుంటున్నారని,నీటికి ఇబ్బంది పడుతున్నమని, మరో మోటారు బిగించమంటే మోటార్ వేసే ప్రసక్తే లేదని,కరెంట్ బిల్లు ఎవరు కట్టాలని, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అంటూ దురుసుగా సమాధానం ఇస్తున్నారని వాపోయారు.అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.