నల్లగొండ జిల్లా:బలవంతుల పాలనలో పాలితులెప్పుడు పీడితులే,అగ్రవర్ణాలదే అధికారం అయితే నియంతృత్వమే బహుజనులకు బహుమతి.కాలం కత్తి పడితే సమరం కూడా సంకోచిస్తోంది.
సామాన్యుని ఆవేశం కట్టలు తెంచుకుంటే బడబాగ్నినైనా భస్మం చేస్తోంది.భూమి కోసం,భుక్తి కోసం,వెట్టిచాకిరి విముక్తి కోసం సొంత బాబాయ్ నే ఎదురించిన ధీశాలి మల్లు స్వారాజ్యం.
భూస్వాముల కుటుంబంలో పుట్టి,పెత్తందారి వ్యవస్తకు వ్యతిరెకంగా పోరాడిన వీర వనిత కామ్రెడ్ స్వరాజ్యం.ఎర్ర జెండాను విడువకుండా,భుజానికేసిన సంచిన మరవకుండా పేద ప్రజల కోసం నిరంతరం పోరాడిన విప్లవాల పొలికేక ఆమె.పూర్వపు నల్గొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం గ్రామంలో 1931లో అర్ధ భూస్వామ్య కుటుంబంలో జన్మించారు.అప్పటికే అనేక రకాలుగా పేదలను ఇబ్బందుకు గురిచేస్తున్న వ్యవస్థను చూసి చలించింది స్వరాజ్యం.10 సంవత్సరాల వయస్సులో మాగ్జిమ్ గోర్కీ యొక్క రచనలు చదివిన స్వరాజ్యం,నిజమైన స్వరాజ్య స్థాపనను కళ్లతో చూడాలనుకుంది.ఆమె 11 ఏళ్ల వయస్సులో కట్టుబానిసలకు స్వస్తి కావాలని ఆంధ్ర మహాసభ ఇచ్చిన పిలుపుకు ప్రతిస్పందనగా కుటుంబ నిబంధనలను ధిక్కరించింది.వివిధ కులాలు,వర్గాల నుండి వచ్చిన బాండెడ్ కార్మికులకు బియ్యం పంపిణీ చేయడంతో ఆమె ప్రజా జీవితం ప్రారంభించింది.13 ఏళ్ల వయసులోనే తన అన్న భీంరెడ్డి నరసింహారెడ్డితో కలిసి పేదల పక్షాన పోరాడాలని నిర్ణయించుకుంది.ఆ స్పూర్తితో నాటి నిజాం సర్కారుకు ముచ్చెమటలు పట్టించింది.రజాకార్ల పాలిటి సింహస్వప్నమై నిలిచింది.1945-48 సంవత్సరాల్లో సాయుధ పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించి నైజాం సర్కారును గడగడలాడించింది.ఈమె పోరాటాల ధాటికి తట్టుకోలేక 1947-48లో ఈమె ఇంటిని పూర్తిగా దగ్ధం చేశారు పెత్తందారి దొరలు.
తుపాకీ చేతపట్టి జమీందార్లకు వ్యతిరేకంగా పోరాడిన మల్లు స్వరాజ్యం,ఒక దళానికి కమాండర్ గా ముందుండి నడిచింది.దళాన్ని నడిపించింది.ఆ సమయంలో ఆమెను పట్టించిన వారికి రూ.10,000 బహుమతిని ప్రకటించింది అప్పటి ప్రభుత్వం.కానీ, భయపడకుండా గిరిజన వాసాల్లోనే తల దాచుకుంది.అది కూడా పసికట్టిన పోలీసు మూకలు గిరిజన సైదమ్మ ఇంటిపైన దాడికి దిగారు.ఆమెను తప్పించడానికి ఆ గిరిజన మహిళ తన 3 నెలల పసిబిడ్డను స్వరాజ్యం చేతికిచ్చి బాలింత వేశంలో పారిపోవాలని దారిచూపింది.ఆ గిరిజన మహిళ తాను బాలింతనని చెప్పినా వినకుండా చిత్ర హింసలకు గురిచేశారు.
అయినా ఈసం అంత గుట్టైనా చెప్పలేదు.కానీ,ఆ గిరిజన మహిళ బిడ్డను తాను కాపాడలేక పోయానే అని కంటనీరు పెట్టుకుంది స్వరాజ్యం.తన ఉద్యమ సహచరుడు మల్లు వెంకట నరసింహారెడ్డిని దళ సభ్యుల బద్దం ఎల్లారెడ్డి, రావినారాయణరెడ్డి ఆద్వర్యంలో వివాహం చేకుంది.2008లో తన భర్త మరణించిన తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాట పరిధిని విముక్త బంధిత కార్మికుల నుండి జమీందార్ల భూమిని తీసుకొని పేదలకు పంచే సాధనంగా విస్తరించింది.తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండు పర్యాయాలు సిపిఐ(ఎం) పార్టీ తరఫున శాసన సభ్యురాలిగా ఎన్నికైంది.కానీ,ఆమె ఇప్పుడు చివరి ఘట్టానికి చేరుకుంది.తన జీవితమంతా ఉద్యమమే ఊపిరిగా బతికింది.చివరి క్షణంలో కూడ పిడికిలి బిగించి భవిష్యత్తు తరాలకు ఉద్యమ స్పూర్తిని నింపుతోంది.
అలాంటి ధీరవనిత అవసరం తెలంగాణ సమాజానికి ఎంతో ఉంది.అందుకే ఇటీవల అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కమ్యూనిస్టు కరదీపిక తొందరగా కోలుకోవాలని మనమూ ఆశిద్దాం…
.