ప్రతి పక్ష నేతలను ముందస్తు అరెస్టులు చేసే పోలీసులు సికింద్రాబాద్ ఘటనలో ఎక్కడున్నారు?చీమ చిటుక్కుమంటే కనిపెట్టే ఇంటిలిజెన్స్ నిఘా ఎందుకు పసిగట్టలేదు.దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలు కలిగిన కమాండ్ కంట్రోల్ రూమ్ ఉపయోగం ఏమిటి?కేంద్రం మీద నింద మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుట్ర కాకపోతే ఏమిటి? టీఆర్ఎస్ ప్రభుత్వం,సీఎం కేసీఆర్ చేస్తున్న పనులన్నీ ప్రజలు గమనిస్తున్నారు.-దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.
నల్లగొండ జిల్లా:కేంద్ర ప్రభుత్వాన్ని,బీజేపీ పార్టీని బదనాం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ ఘటనను అస్త్రంగా వాడుకుందని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.సోమవారం జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్ చిన వెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా శక్తికేంద్ర ఇంఛార్జీల సమావేశానికి ఆయన ముఖ్యాతిధిగా హాజరై నాయకులకు దిశానిర్దేశం చేశారు.అనంతరం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ రైల్వే సంఘటన గురించి ప్రసవిస్తూ ఇలాంటి ఘటన చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
ప్రతి పక్షాలు ఏదైనా ధర్నాకి పిలుపునిస్తే ముందస్తుగా హౌస్ అరెస్టులు చేసి ధర్నాలు చేయకుండా చేసే ప్రభుత్వం,రైల్వే స్టేషన్ లో ఉదయం నుండి సాయంత్రం వరకు విధ్వంసం జరుగుతూ ఉంటే ఎందుకు ఆపలేకపోయిందన్నారు.ఇంటిలిజెన్స్ వ్యవస్థ,సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ ఏం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
రాష్ట్ర ప్రభుత్వ పాలనా విధానం ధృతరాష్ట్రుడి పాలనను తలపిస్తుందని అన్నారు.కేంద్రం ఆస్తులు కదా మనకెందుకని చూస్తూ ఉన్నారా అంటూ ఎద్దేవా చేశారు.
ప్రజల పన్నులతో ఏర్పాటైన ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా లేక కావాలనే చేశారా అని ప్రశ్నించారు.ఇప్పకైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఖరిని మార్చులోవాలని హితవు పలికారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలీసుల కాల్పుల్లో చనిపోయిన యువకుడి అంతిమ యాత్రలో కూడా టీఆర్ఎస్ నాయకులు డబ్బులిచ్చి జనాలని తెచ్చుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం,టీఆర్ఎస్ పార్టీ జెండాలను ఆ వాహనానికి ఉంచడం,ప్రతి పక్షాలను ఆ అంతిమ యాత్రకి వెళ్లకుండా ఆపడం అన్ని కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.రాబోయే కాలంలో తగిన విధంగా బుద్ధి చెబుతారని అన్నారు.
శక్తి కేంద్ర ఇంచార్జీల మీటింగ్ లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి,నల్లగొండ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి,ఉమ్మడి జిల్లాల శక్తి కేంద్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.