నల్లగొండ జిల్లా: నీళ్లు,నిధులు,ఉద్యోగాల పేరిట అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పాలకులు గడిచిన ఈ తొమ్మిదేళ్లలో సంక్షేమం,అభివృద్ధి అంటూ మభ్యపెట్టి వారి ఆస్తులను పెంచుకుని అప్పుల భారం ప్రజలపై వేసిండ్రని,రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుణపాఠం తప్పదని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి,డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరు బాలకృష్ణ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మడబోయిన అర్జున్ అన్నారు.శనివారం స్థానిక పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
ఇక్కడి ప్రజల ఆకాంక్షలను గుర్తించిన ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ ఎంపీలు,ఇతర ప్రజా ప్రతినిధులు సొంత పార్టీపై పోరు చేసి రాష్ట్రం వచ్చేందుకు కృషి చేసిండ్రన్నారు.టీయూఎఫ్ ఐడీసీ ఫండ్స్ మిర్యాలగూడకు రూ.200 కోట్లు వచ్చాయని చెబుతున్న బీఆర్ఎస్ నేతలు,వాటితో ఎక్కడెక్కడ నిర్మాణాలు చేపట్టిండ్రో చెప్పాలన్నారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పేరిట వందల కోట్ల కమిషన్లు దండుకున్న బీఆర్ఎస్ పాలకులు ప్రజల విశ్వసనీయతను కోల్పోయి,తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్ష నేతలపై విమర్శలకు దిగుతుండ్రన్నారు.
సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యతో పాటు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులకు పరిహారం,ఇతర స్థానిక సమస్యలపై మంత్రులను ప్రశ్నిస్తామని ముందస్తు అరెస్ట్లుచేసిండ్రన్నారు.నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సహా అనేక లిఫ్ట్లను నిర్మించి కొన్నేళ్లుగా సాగునీరు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీనే ప్రజలు ఆదరిస్తారని,ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఒక్కసీటు గెలవదన్నారు.
ఎన్నికల వేళ హామీలు ఇచ్చి అమలు చేయని సర్కార్ ను ప్రజలు ఓడించటం ఖాయమన్నారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి,గంధం రామకృష్ణ, గుంజ చంద్రకళ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ సిద్ధూ నాయక్ తదితరులు పాల్గొన్నారు.