నల్లగొండ జిల్లా: మిగ్ జామ్ తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగుతుంది.ఈ తుఫాన్ ప్రభావంతో మంగళవారం తెల్లవారు జామున నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది.
వేల ఎకరాల్లో పంటలు నీట మునిగి అన్నదాతలు అతలాకుతలం అవుతున్నారు.ముఖ్యంగా వరి,మిర్చి,పత్తి పంటలు తీవ్రంగా నష్టపోయారు.
ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ప్రభుత్వం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా,యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపింది.
ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
అన్ని శాఖల అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని,ఎప్పటికప్పుడు సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.ప్రజలు అత్యవసరం అయితే తప్పా ప్రయాణాలు చెయ్యొద్దని, పిల్లలు వాహనాలు ఇవ్వొద్దని, చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
ఎమర్జెన్సీ ఉంటే డయల్ 100 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు.తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఈ క్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా అక్కడడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.