నల్లగొండ జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నీటి గండం ముంచుకొస్తుంది.జిల్లాలోని ప్రధాన జలాశయం నాగార్జున సాగర్ ఇప్పటికే డెడ్ స్టోరేజీకి చేరుకుంది.
దీనితో కృష్ణానది పరివాహక ప్రాంతంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.ఆరు నెలలుగా సరైన వర్షాల్లేక కృష్ణానదికి ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి నీటి ప్రవాహం పూర్తిగా తగ్గడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిలువ గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గింది.
ప్రాజెక్టులో నీటిమట్టం కనిష్ట స్థాయికి కేవలం ఒక అడుగు మాత్రమే మిగిలినట్టు అధికారులు వెల్లడించారు.సాగర్ జలాశయం గరిష్టస్థాయి 590 అడుగుల నీటి మట్టం వద్ద గరిష్ఠ స్థాయి నీటి నిలువ సామర్ద్యం 312 టీఎంసీలు కాగా నానాటికి రిజర్వాయర్‌లో నీటిమట్టం 511 అడుగులకు పడిపోయి నీటి నిలువ 134.92 టీఎంసీల నీరు మాత్రమే నిలువ ఉందని చెబుతున్నారు.
ఇక కేవలం ఒక అడుగు మేరకే లభ్యత నీటి మట్టం మిగిలి ఉందని,510 అడుగుల స్థాయికి మించి దిగువకు నీటిని ఈ రిజర్వాయర్ నుంచి తీసుకునే వీలు లేదంటున్నారు.
ప్రాజెక్టుల్లో నీటి నిల్వ పూర్తిగా పడిపోవడంతో జిల్లాలో తాగునీటి గండం ముంచుకోస్తోంది.ప్రధాన ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు వేగంగా తరిగిపోతుండగా మరో వైపు భూగర్భ జలాల కూడా పడిపోతున్నాయి.
వర్షాలు వచ్చేదాక తాగునీటి అవసరాల కోసం ఉన్ననీటి నిలువలతోనే మరో మూడు నెలల పాటు సర్ధుకుపోయాల్సిన పరిస్థితి అనివార్యంగా మారుతోంది.
మిషన్ భగీరధ ద్వారా నల్లా నీరు రాకపోవటంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సమీపాన ఉన్న వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు.
పట్టణ ప్రాంతాల్లో సైతం పలు కాలనీల్లో నీటికి కటకటలాడాల్సి వస్తోంది.ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అప్పుడే తాగునీటి సమస్యలపై నిరసన ధ్వనులు పుట్టుకొస్తున్నాయి.
భూగర్భ జలాలు అడుగంటడంతో సమస్య మరింత ముదురుతోంది.ఒక్క నల్లగొండ జిల్లా పరిధిలోనే సుమారు 35 లక్షలకు పైగా బోర్లు ఉండగా,అందులో 30 శాతం వరకు ఇప్పటికే ఒట్టిపోయాయి.
మరో 20 శాతం బొటాబొటిగా నీరందిస్తున్నాయి.నల్లా నీటి సరఫరా చాలినంతగా జరగక ప్రజలు అవస్థలు పడుతున్నారు.