అస్తమించిన సాయుధ పోరు కెరటం

నల్లగొండ జిల్లా:తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు,స్వాతంత్ర సమరయోధురాలు,ఎర్రజెండా ముద్దుబిడ్డ,మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ మల్లు స్వరాజ్యం ఇక లేరనే చేదు వార్త ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలను,కమ్యూనిస్టు శ్రేణులను విషాదంలో ముంచేసింది.గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

 A Wave Of Sunken Armed Struggle-TeluguStop.com

ఉమ్మడి నల్లగొండ జిల్లా,ప్రస్తుత సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భీమిరెడ్డి రామిరెడ్డి చొక్కమ్మ దంపతులకు 1931లో మల్లు స్వరాజ్యం జన్మించారు.వందలాది ఎకరాల భూమి కలిగిన భూస్వామ్య కుటుంబంలో జన్మించిన ఆమె పేదల కష్టాలను,కన్నీళ్లను చూసి చలించి,ఎర్రజెండా భుజానికెత్తుకొని శివంగిలా సాయుధ పోరాటంలో దూకింది.1945- 46 వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును గడగడలాడించారు.1947- 46 వ సంవత్సరంలో స్వరాజ్యం ఇంటిని నైజాం గుండాలు తగలబెట్టాయి.అయినా వెనకంజ వేయలేదు,వెన్ను చూపలేదు ఆ వీరనారీ.మల్లు స్వరాజ్యం సాయుధ పోరాటంలో అదిలాబాద్,వరంగల్,కరీంనగర్ జిల్లాలో పని చేశారు.నాడు దొరల దురహంకారాన్ని పాటల ద్వారా చైతన్య పరిచారు.మహిళ కమాండర్ గా పని చేశారు.

అప్పటి నైజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యాన్ని పట్టిస్తే పదివేల రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించారు.ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టారు.

వీరి భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యునిగా,ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు.వీరి సోదరులు సాయుధ పోరాట వీరులు భీమిరెడ్డి నరసింహారెడ్డి,కుశలవరెడ్డి కూడా సీపీఎం పార్టీలో సుధీర్ఘ కాలం వివిధ హోదాలో పని చేశారు.

భీమిరెడ్డి నరసింహరెడ్డి అప్పటి మిర్యాలగూడ పార్లమెంటు నుండి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు.మల్లు స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు.1978 నుండి 83 వరకు మొదటి దఫా,1983 నుండి 84 వరకు రెండవ దఫా ఎమ్మెల్యేగా సిపిఎం పార్టీ తరఫున పనిచేశారు.మిర్యాలగూడ పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు.అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు.

మల్లు వెంకట నరసింహారెడ్డి స్వరాజ్యం దంపతులకు ఒక కూతురు,ఇద్దరు కుమారులు ఉన్నారు.కూతురు పాదూరి కరుణకు ఇద్దరు కుమారులు,ఒక కూతురు.పెద్ద కుమారుడు మల్లు గౌతమ్ రెడ్డికి ఒక కొడుకు,ఒక కూతురు.చిన్న కుమారుడు మల్లు నాగార్జున రెడ్డికి ఇద్దరు కుమారులు.

వీరి చిన్న కోడలు,నాగార్జున రెడ్డి సతీమణి మల్లు లక్ష్మి గత పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీ చేశారు.పెద్ద కుమారుడు మల్లు గౌతంరెడ్డి సిపిఎం పార్టీ నల్గొండ జిల్లా కమిటీ సభ్యునిగా పని చేస్తున్నారు.

చిన్న కుమారుడు మల్లు నాగార్జున్ రెడ్డి సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్నారు.నమ్మిన సిద్ధాంతం కోసం మొత్తం కుటుంబం దశాబ్దాల తరబడి ఎర్రజెండాను భుజాన మోయడం,పేద ప్రజల కోసం జీవితాలను త్యాగం చేయడం ఒక మల్లు కుటుంబానికే దక్కుతుందంటే అతిశయోక్తి కాదు.

నేలరాలిన విప్లవ ధృవతారకు రెడ్ సెల్యూట్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube