నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెం లో గత పది రోజులుగా నీటి సరఫరా లేక ప్రజలు అల్లాడుతున్నారు.గత వర్షాకాలంలో సరైన వర్షాలు కురవక,సాగర్ నీటి విడుదల లేక,చెరువులు,కుంటలు,బోర్లు, బావులు ఎండిపోయి,భూగర్భ జలాలు అడుగంటిపోయి మండుతున్న ఎండలతో గుక్కెడు మంచినీరు అందక గ్రామం మొత్తం నీటి కటకటను ఎదుర్కొంటుంది.
గ్రామంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని పలుమార్లు సంబంధిత అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని మహిళలు మండిపడుతున్నారు.
మిషన్ భగీరథ నీళ్లు అంతంత మాత్రంగా వచ్చేవని,గ్రామానికి వచ్చే పైప్ లైన్ గేట్ వాల్ బంద్ చేయడంతో అసలుకే రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయాన్నీ మిషన్ భగీరథ ఇన్ ఫ్రా అధికారులను అడిగితే మాకేమీ తెలియదని,ఏమైనా ఉంటే ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులను అడగాలని నిర్లక్షంగా సమాధానం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు వేసవిలో మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని గ్రామ ప్రజలకు అవసరమైన త్రాగు నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు.